Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు మీకోసం.. 

Published : 22 Apr 2022 20:57 IST

1. విదేశీ ఓటర్లకు పోస్టల్‌ బ్యాలెట్‌ సదుపాయం!

ఎన్నికల్లో నమోదవుతున్న విదేశీ ఓట్ల సంఖ్య తక్కువగా ఉందని అందుకే వారికి పోస్టల్ బ్యాలెట్‌ సదుపాయం కల్పించాలని భావిస్తున్నట్లు ప్రధాన ఎన్నికల అధికారి సుశీల్‌ చంద్ర తెలిపారు. దక్షిణాఫ్రికా, మారిషస్‌లోని భారత సంతతితో మాట్లాడుతూ ఈ ఆలోచనను వ్యక్తం చేశారు. ఇరు దేశాల్లో అధికారికంగా పర్యటిస్తున్న నేపథ్యంలో అక్కడి భారతీయులతో ఆయన శుక్రవారం సంభాషించారు.

Video: తిరుమల ఎల్‌ఈడీ స్క్రీన్లపై సినిమా పాటలు ప్రసారం

2. క్రెడిట్‌ కార్డు కొత్త రూల్స్‌

వినియోగదారుల అంగీకారం లేకుండా కొత్త కార్డులను జారీ చేయడం లేదా ఉన్న కార్డుల పరిమితిని పెంచడం లాంటివి చేయొద్దని కార్డు జారీ సంస్థలకు ఆర్‌బీఐ స్పష్టం చేసింది. ఈ మేరకు క్రెడిట్‌ కార్డు క్లోజింగ్‌కు సంబంధించి కొన్ని మార్గదర్శకాలను ఆర్‌బీఐ జారీ చేసింది. క్రెడిట్‌ కార్డు క్లోజ్‌ చేయాలని వచ్చిన అభ్యర్థనపై నిర్దేశించిన గడువులోగా స్పందించకుంటే రోజుకు రూ.500 చొప్పున జరిమానా చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించింది.

3. చంద్రబాబుకు ఆంధ్రప్రదేశ్‌ మహిళా కమిషన్ నోటీసులు

తెదేపా అధినేత చంద్రబాబుకు ఆంధ్రప్రదేశ్‌ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఈనెల 27వ తేది ఉదయం 11గంటలకు మంగళగిరిలోని కమిషన్ కార్యాలయంలో విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో అత్యాచారం ఘటనపై విచారణ జరిపేందుకు వెళ్లిన తనను అడ్డుకుని, దూషించారని మహిళా కమిషన్ ఛైర్మన్‌ వాసిరెడ్డి పద్మ అభియోగాలు మోపారు.

Video: మంత్రి కేటీఆర్‌తో ఈటీవీ ప్రత్యేక ముఖాముఖి

4. కార్ల షెడ్‌లో అగ్ని ప్రమాదం.. దగ్ధమైన లగ్జరీ కార్లు

రంగారెడ్డి జిల్లా అత్తాపూర్‌లోని కార్ల షెడ్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. జనప్రియ ఉటోపియా వద్ద షెడ్‌లో మంటలు భారీ ఎత్తున ఎగసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని ఐదు అగ్నిమాపక యంత్రాలతో శ్రమించి మంటలు అదుపుచేశారు. అగ్ని ప్రమాదంలో మెర్సిడెస్‌ బెంజ్‌, బీఎండబ్ల్యూ, ఆడీ వంటి లగ్జరీ కార్లతో పాటు ఇతర చిన్న కార్లు దగ్ధం అయ్యాయి.

5. మాపై ఆరోపణలు నిరాధారం.: నటి జీవితా రాజశేఖర్‌

సినిమాకు సంబంధించిన లావాదేవీల విషయంలో మోసం చేశారంటూ నటులు, దంపతులు రాజశేఖర్‌, జీవితలపై శుక్రవారం కొన్ని వార్తలు వెలువడ్డాయి. వీటిపై జీవిత స్పందించారు. తమపై కొందరు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని, వాటిపై.. శనివారం నిర్వహించనున్న ‘శేఖర్‌’ సినిమా ప్రెస్‌ మీట్‌లో మాట్లాడతానన్నారు. పూర్తి ఆధారాలతో అక్కడకు వస్తానని తెలిపారు. 

Video: ఈ ఘోరం.. ఎవరి పాపం..?

6. ధోనీ.. మా కోసం వెనక్కి వచ్చేయవా..!

ముంబయిపై ఫినిషింగ్‌ టచ్‌ ఇచ్చిన మహేంద్ర సింగ్‌ ధోనీపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తున్నాయి. ఈ క్రమంలో ధోనీని మళ్లీ టీమ్‌ఇండియా జెర్సీలో చూడాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ సందర్భంగా భారత మాజీ పేసర్‌ ఆర్‌పీ సింగ్‌ కూడా ధోనీకి ఓ విజ్ఞప్తి చేశాడు. ‘‘రానున్న టీ20 ప్రపంచకప్‌ కోసం ధోనీ తన రిటైర్‌మెంట్‌ను వెనక్కి తీసుకోవాలి. ఈ విధంగా మనమంతా అతడికి విజ్ఞప్తి చేద్దాం’’ అని ట్వీట్ చేశాడు. 

7. ప్రయాణికుడి అతి.. పిడిగుద్దులు కురిపించిన మైక్‌ టైసన్‌

దిగ్గజ బాక్సర్​, మాజీ ఛాంపియన్​ మైక్ టైసన్​కు సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. విమానంలో తోటి ప్రయాణికుడిపై అతను పిడిగుద్దుల వర్షం కురిపించాడు. కోపంతో పంచ్​లతో విరుచుకుపడ్డాడు. ఈ దెబ్బకు బాధితుడి మొహం నుంచి రక్తం చిందింది. అమెరికా శాన్​ఫ్రాన్సిస్కో ఇంటర్నేషనల్​ విమానాశ్రయం నుంచి ఫ్లోరిడా వెళ్లే విమానంలో బుధవారం రాత్రి జరిగిన ఈ ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు.

8. నా భుజంలో ఉన్నది భారత్‌ టీకా : బ్రిటన్‌ ప్రధాని

కరోనా వ్యాక్సిన్‌ పంపిణీలో భారత్‌ చేస్తోన్న ప్రయత్నాలను బ్రిటన్‌ ప్రధానమంత్రి బోరిస్‌ జాన్సన్‌ ప్రశంసించారు. ఈ సందర్భంగా తాను కూడా భారత్‌ తయారు చేసిన వ్యాక్సిన్‌ తీసుకున్నానన్న ఆయన.. అది తనను సురక్షితంగా ఉంచుతోందన్నారు. ఈ విషయంలో భారత్‌కు ధన్యవాదాలు చెప్పిన జాన్సన్‌.. ప్రపంచ ఫార్మసీగా భారత్‌ ఎదుగుతోందని కొనియాడారు.

9. ఉక్రెయిన్‌ చేతికి అత్యాధునిక రహస్య ఆయుధం..!

ఇప్పటికే అమెరికా స్విచ్‌ బ్లేడ్‌ డ్రోన్ల వంటి అత్యాధునిక ఆయుధాలను ఉక్రెయిన్‌కు అందజేసింది. తాజాగా మరో రహస్య ఆయుధాన్ని ఉక్రెయిన్‌కు సరఫరా చేయనున్నట్లు పెంటగాన్‌ ప్రతినిధి జాన్‌ కెర్బీ వెల్లడించారు. దీనికి సంబంధించిన వివరాలను అత్యంత రహస్యంగా ఉంచారు. దీని పేరు ‘ది ఫినిక్స్ ఘోస్ట్‌’ వ్యవస్థగా మాత్రం వెల్లడించారు.

10. మేరియుపొల్‌లో మారణహోమం..? సామూహిక సమాధులు వెలుగులోకి..!

ఉక్రెయిన్‌లో భీకర దాడులకు తెగబడుతోన్న రష్యా సేనలు పలు నగరాల్లో సామాన్య పౌరులపై దుశ్చర్యలకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఇప్పటికే బుచాలో వెలుగు చూసిన దారుణ ఘటన మరువక ముందే మేరియుపొల్‌లోనూ అటువంటి ఆకృత్యాలే జరిగాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మేరియుపొల్‌ సమీపంలో తాజాగా వెలుగు చూసిన సామూహిక సమాధులు ఉక్రెయిన్‌ అధికారుల ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని