Ukraine: మేరియుపొల్‌లో మారణహోమం..? సామూహిక సమాధులు వెలుగులోకి..!

రష్యా సేనల ఆధీనంలో ఉన్న మేరియుపొల్‌లో వేల సంఖ్యలో ఉక్రెయిన్‌ పౌరులను హతమార్చి.. ఆ నేరాలను దాచిపెట్టేందుకు మృతదేహాలను పాతిపెడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

Published : 23 Apr 2022 01:43 IST

వేల సంఖ్యలో మరణాలు ఉండవచ్చన్న ఉక్రెయిన్‌ అధికారులు

కీవ్‌: ఉక్రెయిన్‌లో భీకర దాడులకు తెగబడుతోన్న రష్యా సేనలు పలు నగరాల్లో సామాన్య పౌరులపై దుశ్చర్యలకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఇప్పటికే బుచాలో వెలుగు చూసిన దారుణ ఘటన మరువక ముందే మేరియుపొల్‌లోనూ అటువంటి ఆకృత్యాలే జరిగాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా రష్యా సేనల అధీనంలో ఉన్న మేరియుపొల్‌లో వేల సంఖ్యలో ఉక్రెయిన్‌ పౌరులను హతమార్చి.. ఆ నేరాలను దాచిపెట్టేందుకు మృతదేహాలను పాతిపెడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మేరియుపొల్‌ సమీపంలో తాజాగా వెలుగు చూసిన సామూహిక సమాధులు ఉక్రెయిన్‌ అధికారుల ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తున్నాయి. వీటికి సంబంధించిన ఉపగ్రహ చిత్రాలు వెలుగు చూడడంతో ఇటీవల బుచాలో బయటపడిన దానికంటే దారుణాలు మేరియుపొల్‌లో చోటుచేసుకున్నాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

యుద్ధ నేరాలను దాచడానికే..!

ఉక్రెయిన్‌ ప్రధాన నగరాల్లో ఒకటైన మేరియుపొల్‌ను స్వాధీనం చేసుకునేందుకు రష్యా సేనలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఈ క్రమంలో వేల మంది పౌరులను పొట్టనబెట్టుకున్నాయనే వార్తలు వెలుబడ్డాయి. తాజాగా మేరియుపొల్‌కు సమీపంలోని మన్‌హుష్‌ పట్టణంలో 200లకు పైగా సమాధులు తవ్విన విషయం మాక్సర్‌ టెక్నాలజీస్‌ విడుదల చేసిన ఉపగ్రహ చిత్రాల్లో వెలుగు చూసింది. మేరియుపొల్‌లో ప్రతిఘటించిన పౌరులను హతమార్చి సమీప పట్టణంలో తవ్విన ఈ సమాధుల్లో పూడ్చివేస్తున్నట్లు ఉక్రెయిన్‌ అధికారులు ఆరోపిస్తున్నారు. కేవలం యుద్ధ నేరాలను కప్పిపుచ్చుకోవడానికే రష్యా సైన్యం ఈ దాష్టీకాలకు పాల్పడుతోందని మేరియుపొల్‌ మేయర్‌ వాదిం బోయ్‌కెన్‌కో ఆరోపించారు. ఇప్పటివరకు 9వేల మందిని పూడ్చగలిగే సమాధులను గుర్తించినట్లు మేరియుపొల్‌ సిటీ కౌన్సిల్‌ అంచనా వేసింది.

20వేల మంది మృతి..?

4లక్షలకు పైగా జనాభా కలిగిన మేరియుపొల్‌లో ప్రస్తుతం లక్ష మంది చిక్కుపోయినట్లు సమాచారం. క్షిపణి దాడులతో నాశనమవుతోన్న నగరంలో ఆహారం, నీరు, ఔషధాల లేమితో వారందరూ తీవ్రంగా సతమతమవుతున్నట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్‌ అధికారుల లెక్కల ప్రకారం, రష్యా సేనల ఆధీనంలో ఉన్న మేరియుపొల్‌లోనే 20వేలకుపైగా పౌరులు మరణించి ఉండవచ్చని అంచనా. అయితే, ఆ నగర సమీపంలోని గ్రామాల్లో హత్యాకాండకు పాల్పడుతూ మృతదేహాలను సామూహిక ఖననాలు చేస్తున్నట్లు ఉక్రెయిన్‌ అధికారులు ఆరోపిస్తున్నారు. తాజాగా మేరియుపొల్‌ సమీపంలోని మన్‌హుష్‌ పట్టణంలో వెలుగు చూసిన వందల సంఖ్యలో సమాధులు మార్చి నెలలోనే తవ్వినప్పటికీ ఈ మధ్యే వాటి సంఖ్య పెరిగినట్లు ఉపగ్రహ చిత్రాల ద్వారా తెలుస్తోందన్నారు.

ఇదిలా ఉంటే, ఉక్రెయిన్‌ నుంచి మేరియుపొల్‌కు విముక్తి కలిగించామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ఇటీవల ప్రకటించారు. ఇదే సమయంలో అక్కడి అజోవ్‌స్తల్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉన్న సొరంగాల్లో 2వేల మంది ఉక్రెయిన్‌ సైనికులు ఉన్నట్లు అంచనా. అయినప్పటికీ ఆ ప్రాంతం మొత్తం ముట్టడించి ఏ ఒక్కరినీ అందులోకి వెళ్లనీయొద్దని రష్యా రక్షణశాఖ మంత్రి సెర్గీ షోయిగును అధ్యక్షుడు పుతిన్‌ ఆదేశించారు. కనీసం మూడు, నాలుగు రోజుల తర్వాతైనా సొరంగంలో వారు ఆహారం, నీటి కోసం బయటకు వస్తారని.. అలా వచ్చేవారిని అదుపులోకి తీసుకోవాలని రష్యా సేనలు వ్యూహరచన చేసినట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు