Election commission: విదేశీ ఓటర్లకు పోస్టల్‌ బ్యాలెట్‌ సదుపాయం... సీఈసీ సుశీల్‌ చంద్ర

ఎన్నికల్లో నమోదవుతున్న విదేశీ ఓట్ల సంఖ్య తక్కువగా ఉందని అందుకే వారికి పోస్టల్ బ్యాలెట్‌ సదుపాయం కల్పించాలని భావిస్తున్నట్లు ప్రధాన ఎన్నికల అధికారి సుశీల్‌ చంద్ర తెలిపారు.

Published : 22 Apr 2022 19:23 IST

దిల్లీ: ఎన్నికల్లో నమోదవుతున్న విదేశీ ఓట్ల సంఖ్య తక్కువగా ఉందని అందుకే వారికి పోస్టల్ బ్యాలెట్‌ సదుపాయం కల్పించాలని భావిస్తున్నట్లు ప్రధాన ఎన్నికల అధికారి సుశీల్‌ చంద్ర తెలిపారు. దక్షిణాఫ్రికా, మారిషస్‌లోని భారత సంతతితో మాట్లాడుతూ ఈ ఆలోచనను వ్యక్తం చేశారు. ఇరు దేశాల్లో అధికారికంగా పర్యటిస్తున్న నేపథ్యంలో అక్కడి భారతీయులతో ఆయన శుక్రవారం సంభాషించారు. భారతీయ ఓటర్లుగా నమోదు చేసుకోవాలని కోరారు. విదేశీయులకు ఎలక్ట్రానిక్‌ ట్రాన్స్‌మీటెడ్‌ పోస్టల్‌ బ్యాలెట్‌ సిస్టమ్ (ఈటీపీబీఎస్‌) సదుపాయాన్ని
కల్పించనున్నట్లు చెప్పారు.

ఇప్పటి వరకూ ఈ సదుపాయం ఉపయోగించుకున్నది ఎవరంటే?

ఈ ఈటీపీబీఎస్‌ సదుపాయం ఇప్పటి వరకు సాయుధ బలగాలు, కేంద్ర సాయుధ పోలీస్‌ బలగాల సభ్యులు, భారతీయ రాయబార కార్యాలయాలు, దౌత్య సంబంధాల అధికారులకు మాత్రమే విస్తరించి ఉంది. 2020లో అర్హత కలిగిన ఎన్‌ఆర్‌ఐలకు కూడా ఈ సదుపాయాన్ని విస్తరించాలని ఎన్నికల కమిషన్‌ కేంద్రానికి నివేదించిందని తెలిపారు. నవంబర్‌ 27, 2020న న్యాయ మంత్రిత్వశాఖలోని శాసనసభ కార్యదర్శికి పంపిన లేఖలో, సేవా ఓటర్ల విషయంలో ఈ ఈటీపీబీఎస్‌ సదుపాయం విజయవంతంగా అమలు చేశారని ఇప్పుడు విదేశాల్లో కూడా అందుబాటులోకి తేవాలని కోరినట్లు చెప్పారు. ఎన్నికల కమిషన్‌ కేంద్ర న్యాయమంత్రిత్వ శాఖ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో చర్చలు జరిపి ఈ విషయంలో వచ్చే సమస్యలను అధిగమించడానికి ప్రయత్నిస్తోందన్నారు. ప్రస్తుతం ఎన్‌ఆర్‌ఐలు తమ నమోదిత నియోజకవర్గాల్లో ఓటు వేస్తున్నారన్నారు.

భారత్‌లో ఎన్నికల నిర్వహణ: దాదాపు 1,12,000 మంది విదేశీయులు భారతీయ ఓటర్లుగా నమోదయ్యారని ఈసీ వర్గాలు చెబుతున్నాయి. రెండు దేశాల పర్యటన సందర్భంగా సుశీల్‌ అనేక ప్రాంతాల్లో ఎన్నికల నిర్వహణలో తన అనుభవాలను ప్రవాస భారతీయులతో పంచుకున్నారు. అతిపెద్ద ప్రజాస్వామ్య భారతదేశంలో దాదాపు 950 మిలియన్ల మంది ఓటర్లుగా నమోదయ్యారని తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా మహిళలు, దివ్యాంగులు, వృద్ధులు ఓటు వేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు తెలిపారు. డిజిటల్‌ ప్లాట్‌ఫాంలను ఉపయోగించుకుని ఏకీకృత ప్రాతిపదికన న్యాయమైన ఎన్నికలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఎస్‌వీఈఈపీ, ఈవీఎమ్‌, వీవీపీఎటీ వంటి సాంకేతిక వేదికల ద్వారా ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని