Ukraine Crisis: ఉక్రెయిన్‌ చేతికి అత్యాధునిక రహస్య ఆయుధం..!

ఉక్రెయిన్‌ యుద్ధంలో మార్పులు చోటు చేసుకొనే కొద్దీ విభిన్న వ్యూహాలు తెరపైకి వస్తు్న్నాయి. ఇప్పటికే అమెరికా స్విచ్‌బ్లేడ్‌ డ్రోన్ల వంటి అత్యాధునిక ఆయుధాలను ఉక్రెయిన్‌కు అందజేసింది. తాజాగా మరో రహస్య ఆయుధాన్ని ఉక్రెయిన్‌కు

Published : 22 Apr 2022 17:32 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఉక్రెయిన్‌ యుద్ధంలో మార్పులు చోటు చేసుకొనే కొద్దీ విభిన్న వ్యూహాలు తెరపైకి వస్తున్నాయి. ఇప్పటికే అమెరికా స్విచ్‌ బ్లేడ్‌ డ్రోన్ల వంటి అత్యాధునిక ఆయుధాలను ఉక్రెయిన్‌కు అందజేసింది. తాజాగా మరో రహస్య ఆయుధాన్ని ఉక్రెయిన్‌కు సరఫరా చేయనున్నట్లు పెంటగాన్‌ ప్రతినిధి జాన్‌ కెర్బీ వెల్లడించారు. దీనికి సంబంధించిన వివరాలను అత్యంత రహస్యంగా ఉంచారు. దీని పేరు ‘ది ఫినిక్స్ ఘోస్ట్‌’ వ్యవస్థగా మాత్రం వెల్లడించారు. ఈ డ్రోన్లను అమెరికాకు చెందిన ఏవెక్స్‌ ఏరోస్పేస్‌ సంస్థ తయారు చేసింది. ముఖ్యంగా ఉక్రెయిన్‌ తూర్పు ప్రాంతంలోని మైదానాల్లో పోరాడటానికి అనుకూలంగా దీనిని అభివృద్ధి చేశారు.

ఈ అంశంపై పెంటగాన్‌ ప్రతినిధి జాన్‌ కెర్బీ మాట్లాడుతూ ‘‘ నేను వివరాల్లోకి వెళ్లను. అక్కడి భౌగోళిక పరిస్థితుల్లో ఈ డ్రోన్‌ కచ్చితంగా లక్ష్యాలను సాధిస్తుంది. ఇది స్విచ్‌ బ్లేడ్‌ డ్రోన్లతో సమానంగా పనిచేస్తుంది. కాకపోతే కొంచెం భిన్నంగా ఉంటుంది. ఇది పూర్తిగా అటాక్‌ డ్రోన్‌. దీనిని అందుకోసమే డిజైన్‌ చేశారు. దీనికి ఉన్న కెమెరాలు యుద్ధక్షేత్ర పరిస్థితుల సమాచారాన్ని పూర్తిగా అందిస్తాయి. కానీ, దాడి చేయడమే దీని ప్రథమ కర్తవ్యం. ఉక్రెయిన్‌ డ్రోన్ల అవసరాలు తీర్చేలా సరికొత్తవి అభివృద్ధి చేసే ప్రక్రియ కొనసాగుతుంది’’ అని పేర్కొన్నారు. అంతకుమించి వివరాలు వెల్లడించేందుకు పూర్తిగా నిరాకరించారు. ఏవెక్స్‌ సంస్థ కూడా దీనికి సంబంధించిన వివరాలు వెల్లడించేందుకు నిరాకరించింది.

ఇప్పటి వరకు అమెరికా ఈ డ్రోన్‌ను ఏ యుద్ధంలోనూ వినియోగించలేదు. దీనిని రేంజ్‌, కచ్చితత్వాన్ని అత్యంత గోప్యంగా ఉంచారు. అమెరికా స్విచ్‌ బ్లేడ్‌ డ్రోన్లను సరఫరా చేయడానికి ముందు కొంత మంది ఉక్రెయిన్‌  సైనికులకు శిక్షణ ఇచ్చింది. ఈ ఘోస్ట్‌ డ్రోన్ల వినియోగానికి అటువంటి శిక్షణ సరిపోతుందని అమెరికా వెల్లడించింది. అమెరికా మొత్తం 400 స్విచ్‌ బ్లేడ్‌ డ్రోన్లను సరఫరా చేయడానికి అంగీకరించింది. వీటిల్లో ఇప్పటికే 100 ఉక్రెయిన్‌కు చేరుకొన్నాయి. త్వరలో మిగిలినవి కూడా యుద్ధక్షేత్రానికి తరలించనున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని