ఆఫీస్‌ ఛైర్‌ను ఆవిష్కరించిందెవరో తెలుసా?

ఒకప్పుడు ఏ కార్యాలయంలోనైనా ఉద్యోగులు కూర్చోవడానికి చెక్క కుర్చీలే ఉండేవి. ఇప్పుడు ఏ ఎక్కడ చూసినా చక్రాల కుర్చీలే(ఆఫీస్‌ వీల్‌ ఛైర్స్‌) దర్శనమిస్తాయి. వీటిలో కూర్చుంటే స్వల్ప దూరం వెళ్లడానికి మాటిమాటికి లేవాల్సిన అసవరం ఉండదు. ఈ కుర్చీలో కూర్చొని కాస్త

Updated : 13 Nov 2020 12:32 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఒకప్పుడు ఏ కార్యాలయంలోనైనా ఉద్యోగులు కూర్చోవడానికి చెక్క కుర్చీలే ఉండేవి. ఇప్పుడు ఎక్కడ చూసినా చక్రాల కుర్చీలే(ఆఫీస్‌ వీల్‌ ఛైర్స్‌) దర్శనమిస్తాయి. వీటిలో కూర్చుంటే స్వల్ప దూరం వెళ్లడానికి మాటిమాటికి లేవాల్సిన అవసరం ఉండదు. ఈ కుర్చీలో కూర్చొని కాలితో నెడితే అదే మనల్ని కొంత దూరం తీసుకెళ్తుంది. పక్కనే ఉన్న మరో డెస్క్‌కు వెళ్లాలన్నా, చుట్టుపక్కల ఉండే వస్తువులను తీసుకోవాలన్న ఈ కుర్చీలతో సౌకర్యవంతంగా ఉంటుంది. వీటినే ‘ఆఫీస్‌ ఛైర్స్‌’ అంటుంటారు. ధరను బట్టి వీటిలో పలు డిజైన్లు అందుబాటులో ఉన్నాయి. మీరూ ఆఫీసుకెళ్లి ఇలాంటి వాటిలోనే కూర్చొని పనిచేస్తుంటారు కదా.. మరి ఎప్పుడైనా ఈ ఆఫీస్‌ ఛైర్లను ఎవరు కనిపెట్టారు అనే సందేహం వచ్చిందా? ఎవరో ఒక శాస్త్రవేత్త కనిపెట్టి ఉంటారులే అని అనుకోకండి. దీన్ని ఎవరు కనిపెట్టారో తెలిస్తే.. ఆశ్చర్యపోతారు.

ఛార్లెస్‌ డార్విన్‌.. ఈ పేరు ప్రపంచానికి సుపరిచితమే. భూమిపై జీవం ఎలా పుట్టింది అనే అంశంపై ఎన్నో సిద్ధాంతాలు, వాదనలు ఉన్నాయి. వాటిలో ప్రపంచం మెచ్చిన, నమ్ముతున్న జీవ పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది డార్వినే. జీవరాశి పుట్టుక గురించి 1859లో ఆయన ‘ది ఆరిజిన్‌ ఆఫ్‌ స్పీసెస్‌’ అనే పుస్తకం రచించారు. భూమిపై జీవరాశి ఉన్నపళంగా పుట్టలేదని, ఒక జీవ కణం నుంచి కాలక్రమంలో అనేక జీవరాశులు పుట్టుకొచ్చాయని పేర్కొన్నారు. కోతులే పరిణామ క్రమంలో మనుషులుగా మార్పు చెందాయని డార్విన్‌ సిద్ధాంతం చెబుతోంది. ఈ సిద్ధాంతాన్ని వ్యతిరేకించే వారు కూడా చాలా మంది ఉన్నారు. కానీ, దీన్ని అనేక మంది శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు అంగీకరించారు. అలా ఎన్నో పరిశోధనలు చేసి జీవరాశి పుట్టుకను కనిపెట్టిన ఛార్లెస్‌ డార్వినే.. ఈ ఆఫీస్‌ ఛైర్లను కనుగొన్నారు. నమ్మశక్యంగా లేదు కదా..! కానీ, నిజం ఆయనే దీన్ని ఆవిష్కరించారు.

1809 ఫిబ్రవరి 12న ఇంగ్లాండ్‌లో సంపన్న కుటుంబంలో జన్మించిన ఛార్లెస్‌ డార్విన్‌కు చిన్నతనం నుంచే జంతువులు, పక్షులపై ఆసక్తి ఉండేది. అలా ఉన్నత విద్యను అభ్యసించి జీవశాస్త్రంపై పరిశోధనలు చేయడం మొదలుపెట్టారు. 1840వదశాబ్దం ప్రారంభంలో ఛార్లెస్‌ డార్విన్‌ వివిధ జీవజాతులపై పరిశోధనలు చేశారు. ఈ క్రమంలో ప్రయోగశాలలో తను కూర్చున్న కుర్చీకి నలువైపులా పరికరాలు ఉండేవి. వాటిని తీసుకోవడానికి ప్రతిసారి కుర్చీలోంచి లేవాల్సి రావడం డార్విన్‌ను విసిగించింది. దీంతో తన కుర్చీ కింద చక్రాలు అమర్చారు. దీంతో కుర్చీలో కూర్చొనే చుట్టుపక్కల ఉన్న వస్తువుల్ని తీసుకోవడం సులువైంది.

అయితే, అదే సమయంలో వ్యాపారస్తులు తమ వ్యాపారాలను ఇంట్లో నిర్వహించడం నుంచి.. ప్రత్యేకంగా కార్యాలయాలు ఏర్పాటు చేసుకోవడం మొదలైంది. అప్పటి వరకు కుటుంబసభ్యులు, స్నేహితులతో నడిపించే కార్యకలాపాలకు.. ఉద్యోగులను నియమించాల్సి వచ్చింది. దీంతో ఉద్యోగుల కోసం డార్విన్‌ తయారు చేసినటువంటి చక్రాల కుర్చీలను తయారు చేయించేవారు. ఈ కుర్చీల గురించి తెలిసి జర్మనీకి చెందిన ప్రముఖ రాజకీయవేత్త బిస్మార్క్‌ పార్లమెంటులో ఇలాంటి కుర్చీలనే వేయించాడు. ఆ తర్వాత 1849లో అమెరికాకు చెందిన ట్రాయ్‌ అనే సంస్థ థామస్‌ ఇ. వారెన్‌ అనే శాస్త్రవేత్తతో ‘సెంట్రిపెటెల్‌ స్ప్రింగ్‌ ఆర్మ్‌ఛైర్‌ (ప్రస్తుత ఆఫీస్‌ ఛైర్లకు ప్రాథమిక రూపంగా చెప్పొచ్చు)ను తయారు చేయించింది. వాటిని 1851లో లండన్‌లో నిర్వహించిన భారీ ఎగ్జిబిషన్‌లో ప్రదర్శించారు. అలా కాలక్రమంలో ఈ ఆఫీస్‌ ఛైర్‌ అభివృద్ధి చెందుతూ ఇప్పుడు అనేక డిజైన్లలో అందుబాటులోకి వచ్చాయి. ఇదండీ చక్రాల కుర్చీ కథ.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు