బడిబాట: దేశంలో 48శాతం విద్యార్థులు కాలినడకనే పాఠశాలలకు..!

మన దేశంలో పాఠశాలలకు వెళ్లే 48శాతం మంది విద్యార్థులకు కాలినడకనే అనుసరిస్తున్నట్లు తాజా సర్వే వెల్లడించింది.

Published : 27 May 2022 01:57 IST

నేషనల్‌ అచీవ్‌మెంట్‌ సర్వే(NAS)లో వెల్లడి

దిల్లీ: మన దేశంలో పాఠశాలలకు వెళ్లే 48శాతం మంది విద్యార్థులకు కాలినడకనే అనుసరిస్తున్నట్లు తాజా సర్వే వెల్లడించింది. కేవలం తొమ్మిది శాతం చిన్నారులు మాత్రమే పాఠశాల వాహనం వినియోగిస్తున్నట్లు తెలిపింది. అంతేకాకుండా 25శాతం పాఠశాలలకు చెందిన విద్యార్థుల చదువుల్లో వారి తల్లిదండ్రుల నుంచి మద్దతు ఉండడం లేదని తేలింది. కేంద్ర విద్యాశాఖ గతేడాది నిర్వహించిన నేషనల్‌ అచీవ్‌మెంట్‌ సర్వే (NAS)-2021లో ఈ విషయాలు వెల్లడయ్యాయి.

దేశవ్యాప్తంగా గతేడాది నవంబర్‌ 12న నిర్వహించిన ఈ సర్వేలో 720 జిల్లాల్లోని లక్షా 18వేల పాఠశాలల నుంచి వివరాలు సేకరించారు. ఈ సర్వేలో మూడు, ఐదు, ఎనిమిది, పదోతరగతికి చెందిన మొత్తం 34లక్షల మంది విద్యార్థులు పాల్గొన్నారు. వీరిలో 48శాతం మంది విద్యార్థులు కాలినడకనే పాఠశాలలకు చేరుకుంటున్నట్లు చెప్పగా.. మరో 18శాతం మంది సైకిళ్లను వాడుతున్నారు. ఆర్టీసీ వంటి ప్రజారవాణా, స్కూల్‌ వాహనాల్లో వెళ్లేవారు తొమ్మిది శాతం చొప్పున ఉన్నారు. మరో ఎనిమిది శాతం మంది ద్విచక్ర వాహనాల్లో పాఠశాలలకు వెళ్తుండగా మూడు శాతం మంది కార్లు/క్యాబ్‌లలో వెళ్తున్నట్లు చెప్పారు. ఇక చదువుల్లో తల్లిదండ్రులు తమ చిన్నారులకు బాసటగా ఏవిధంగా నిలవాలో 87శాతం పాఠశాలలు చెబుతున్నట్లు సర్వేలో వెల్లడైంది. అయితే, వారిలో 25శాతం మంది విద్యార్థులకు తల్లిదండ్రుల నుంచి మద్దతు కరవైందని తేలింది.

నేషనల్‌ అచీవ్‌మెంట్‌ సర్వేలో భాగంగా ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్‌తోపాటు ప్రైవేటు పాఠశాలను పరిగణనలోకి తీసుకున్నారు. ఇందులో భాగంగా మూడు, ఐదు తరగతులు చదివే విద్యార్థులను భాషా పరిజ్ఞానం, గణితం, ఈవీఎస్‌ వంటి సబ్జెక్టులపై పట్టును పరిశీలించారు. ఎమినిదో తరగతి విద్యార్థులకు భాషా పరిజ్ఞానంతోపాటు గణితం, సామాన్య, సాంఘిక శాస్త్రాలపై అవగాహన ఏమేరకు ఉందో అంచనా వేయగా.. పదో తరగతి విద్యార్థులకు భాషా పరిజ్ఞానం, గణితం, సామాన్య, సాంఘికశాస్త్రంతోపాటు ఇంగ్లీష్‌పై పట్టును విశ్లేషించారు. ఈ అచీవ్‌మెంట్‌ టెస్ట్‌తోపాటు విద్యార్థులు, ఉపాధ్యాయులు, పాఠశాలలపై ఎన్‌సీఈఆర్‌టీ రూపొందించిన ప్రశ్నలను 22 భాషల్లో అనువదించి అందించారు. జాతీయ స్థాయిలో సీబీఎస్‌ఈ నిర్వహించిన ఈ సర్వేను కేవలం ఒకేరోజులో పూర్తిచేయగా.. ఇందుకు ఎన్‌ఐసీ సాంకేతిక సహకారం అందించినట్లు కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని