Survey: కొవిడ్‌ తీవ్రత పెరిగితే.. ఆన్‌లైన్‌ క్లాసుల వైపే తల్లిదండ్రుల మొగ్గు!

దేశంలో కొవిడ్‌ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా శుక్రవారం 3,377 కొత్త కేసులు రాగా.. 60 మంది మృత్యువాత పడ్డారు. గతకొన్ని రోజులుగా దేశంలో కరోనా .....

Published : 30 Apr 2022 02:28 IST

సర్వేలో వెల్లడి

దిల్లీ: దేశంలో కొవిడ్‌ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా శుక్రవారం 3,377 కొత్త కేసులు రాగా.. 60 మంది మృత్యువాత పడ్డారు. గతకొన్ని రోజులుగా దేశంలో కరోనా ప్రభావం పెరుగుతోన్న వేళ పిల్లల్ని పాఠశాలలకు పంపే తల్లిదండ్రుల మనోగతాన్ని తెలుసుకొనేందుకు ఓ సంస్థ చేపట్టిన సర్వే విడుదలైంది. కరోనా పాజిటివిటీ రేటు పెరుగుతున్న కొద్దీ ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించడమే మేలని 63శాతం మంది తల్లిదండ్రులు కోరుకుంటున్నట్టు సర్వే వెల్లడించింది. ‘‘ఏదైనా ఒక జిల్లాలో 2శాతం పాజిటివిటీ రేటు దాటిన తర్వాత ఆన్‌లైన్‌ తరగతులు ప్రారంభించాలని సర్వేలో పాల్గొన్న 27% మంది  అభిప్రాయపడ్డారు. అలాగే, ఒక జిల్లాలో పాజిటివిటీ రేటు 5శాతం దాటితే ఆన్‌లైన్‌ తరగతులు అందుబాటులోకి తేవాలని.. అలాగైతే పిల్లల చదువులపై ఎలాంటి ప్రభావం ఉండదని 63శాతం మంది చెప్పినట్టు సర్వే పేర్కొంది. 

ఈ సర్వేలో పాల్గొన్న తల్లిదండ్రుల్లో కేవలం 34శాతం మంది మాత్రమే పూర్తిస్థాయిలో భౌతిక తరగతులు నిర్వహించాలని సూచించారని సర్వే స్పష్టంచేసింది. మరో 34శాతం మంది ఇండోర్‌ లంచ్‌, స్నాక్స్‌ బ్రేక్‌లు లేకుండా స్వల్పకాల తరగతులు నిర్వహిస్తే బాగుంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. కాగా.. మిగతా 29శాతం మంది తల్లిదండ్రులు మాత్రం ఒక జిల్లాలో పాజిటివిటీ రేటు 5శాతం కన్నా ఎక్కువగా ఉంటే మాత్రం భౌతిక తరగతులను నిలిపివేయాలని తేల్చి చెప్పేశారని సర్వే వివరించింది.  అయినా.. దేశవ్యాప్తంగా అనేక పాఠశాలల్లో ఆన్‌లైన్‌ విద్యా సదుపాయాలు అందుబాటులో లేవు. అందువల్ల, ఇలాంటి సందర్భాల్లో పాజిటివిటీ రేటు గణనీయ స్థాయికి చేరుకొనే దాకా స్వల్ప వ్యవధి పాఠశాలలు నిర్వహించడమే ఉత్తమమైన ఎంపికగా సర్వే తెలిపింది. కరోనా ప్రవేశించిన తర్వాత దాదాపు ఏడాదికి పైగా దేశ వ్యాప్తంగా విద్యా సంస్థలు మూతపడిన విషయం తెలిసిందే.

‘లోకల్‌ సర్కిల్స్‌’ అనే ఆన్‌లైన్‌ వేదిక దేశవ్యాప్తంగా 314 జిల్లాల్లో ఈ సర్వే నిర్వహించింది. ఇందులో భాగంగా 23,500 మంది తల్లిదండ్రుల నుంచి అభిప్రాయాలు సేకరించింది. సర్వేలో పాల్గొన్నవారిలో 62శాతం మంది పురుషులు కాగా.. 38శాతం మహిళలు ఉన్నారని ఆ సంస్థ తెలిపింది. సర్వేలో తమ అభిప్రాయాలు పంచుకున్నవారిలో 44శాతం మంది మెట్రో నగరాలు, టైర్‌ 1 జిల్లాలకు చెందినవారు ఉండగా.. 34శాతం మంది టైర్‌ 2 జిల్లాలు, 22శాతం మంది టైర్‌ 3, టైర్‌ 4 జిల్లాలు, గ్రామీణ ప్రాంతాలకు చెందినవారు ఉన్నట్టు పేర్కొంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని