ఆ 2 రాష్ట్రాల్లోనే 67% యాక్టివ్‌ కేసులు 

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి, మరణాలు తగ్గుదల కొనసాగుతోందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం ఉన్న క్రియాశీల కేసుల్లో (యాక్టివ్‌ కేసులు) 67శాతం కేవలం రెండు రాష్ట్రాల్లోనే ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి......

Updated : 28 Jan 2021 17:12 IST

దిల్లీ: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి, మరణాలు తగ్గుదల కొనసాగుతోందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం ఉన్న క్రియాశీల కేసుల్లో (యాక్టివ్‌ కేసులు) 67శాతం కేవలం రెండు రాష్ట్రాల్లోనే ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్‌ భూషణ్‌ వెల్లడించారు. దేశవ్యాప్తంగా మొత్తం 1,73,740 యాక్టివ్‌ కేసులు ఉండగా.. వీటిలో కేరళలో 72,476, మహారాష్ట్రలో 44,624 ఉన్నట్టు చెప్పారు. గురువారం ఆయన దేశంలో కరోనా పరిస్థితిపై మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ మధ్యాహ్నం 2గంటల వరకు దేశ వ్యాప్తంగా 25,07,556మందికి టీకా పంపిణీ జరిగినట్టు చెప్పారు. అలాగే, దేశంలో రోజువారీ మరణాలు 125 కన్నా తక్కువే ఉన్నాయని, ఎనిమిది నెలల తర్వాత ఇంత తక్కువ మరణాలు నమోదైనట్టు తెలిపారు. ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా 19.4 కోట్ల శాంపిల్స్‌ పరీక్షించగా.. 1,07,01,193మందికి వైరస్‌ సోకింది. వీరిలో 1,03,73,606 మంది (96.94%) కోలుకొని డిశ్చార్జి కాగా.. 1,53,847మంది ప్రాణాలు కోల్పోయారు. 

10లక్షల మందికి వ్యాక్సినేషన్‌.. ఏ దేశానికి ఎన్నిరోజులు పట్టింది?
భారత్ చేపట్టిన ప్రపంచంలోనే అతి పెద్ద వ్యాక్సినేషన్‌ ప్రక్రియ శరవేగంగా కొనసాగుతోందని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రపంచ దేశాలతో పోలిస్తే మన దగ్గరే తక్కువ సమయంలో ఎక్కువ మందికి వ్యాక్సిన్‌ వేసినట్టు అధికారులు వెల్లడించారు. మిలియన్‌ మందికి వ్యాక్సిన్‌ వేసేందుకు భారత్‌కు 6 రోజుల సమయం పడితే.. అమెరికాలో 10 రోజులు, స్పెయిన్‌ 12, ఇజ్రాయెల్‌ 14, యూకే 18, ఇటలీ 19, జర్మనీ 20, యూఏఈ 27 రోజుల చొప్పున సమయం పట్టిందని అధికారులు వివరించారు.

వ్యాక్సినేషన్‌లో తెలుగు రాష్ట్రాల పనితీరు బాగుంది!

మరోవైపు, భారత్‌లో ఈ మధ్యాహ్నం 2గంటల సమయం వరకు 25.07 లక్షల మందికి టీకా పంపిణీ జరిగింది. వ్యాక్సినేషన్‌ కోసం ఆరోగ్య సిబ్బంది రిజిస్ట్రేషన్‌ చేయించుకోవడంలో తెలుగు రాష్ట్రాలతో పాటు లక్షద్వీప్‌, ఒడిశా, హరియాణా, అండమాన్‌ నికోబార్‌దీవులు, రాజస్థాన్‌, త్రిపుర, మిజోరం, కర్ణాటక, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలు మెరుగైన పనితీరు కనబరుస్తున్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. అలాగే, ఝార్ఖండ్‌, దిల్లీ, తమిళనాడు, ఉత్తరాఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర ఇంకా మరింతగా మెరుగుపడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

ఇదీ చదవండి..

సీబీఎస్‌ఈ పరీక్షల షెడ్యూల్‌ ఎప్పుడో తెలుసా? 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని