కరోనా: 6 వారాలు.. 6 నెలలు.. ఆరోసారి!

కొవిడ్-19 బాధితుల సంఖ్య కేవలం ఆరువారాల్లోనే రెట్టింపయిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అథనోమ్‌ గెబ్రెసస్‌ ప్రకటించారు.

Published : 28 Jul 2020 13:41 IST

ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరక్టర్‌ ప్రకటన

జెనీవా: ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్-19 బాధితుల సంఖ్య కేవలం ఆరువారాల్లోనే రెట్టింపయిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అథనోమ్‌ గెబ్రియేసస్‌‌ ప్రకటించారు. కరోనా వైరస్‌ను ప్రపంచ మహమ్మారిగా ప్రకటించి ఆరు నెలలు పూర్తికావడంతో ఆయన ఓ ప్రకటనను విడుదల చేశారు. ఈ విధంగా ఆరోగ్య అత్యయిక స్థితిని ప్రకటించడం చరిత్రలో ఇది ఆరోసారని ఆయన తెలిపారు. మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి..

ఇంకా బలం పుంజుకుంటుంది..

జనవరి 30న తాము అత్యయిక స్థితిని ప్రకటించే సమయంలో చైనా వెలుపల వంద కంటే తక్కువ కేసులుండగా, మరణాలు నమోదుకాలేదని టెడ్రోస్‌ అథనోమ్‌ గుర్తు చేశారు. తమ వద్దనున్న గణాంకాల ప్రకారం ఇప్పటి వరకు అంతర్జాతీయంగా సుమారు కోటి అరవై లక్షల కొవిడ్‌ కేసులు నమోదు కాగా 6,40,000 మంది మృతిచెందారన్నారు. ఇంతటితో సరికాదని..ఈ మహమ్మారి ఇంకా బలం పుంజుకుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ‘‘కొవిడ్‌-19 ప్రపంచాన్నే మార్చివేసింది. ఇది ప్రజలను, జాతులను, దేశాలను దగ్గర చేస్తూనే విభజించింది కూడా. మనిషి బలాన్ని, బలహీనతను కూడా తేటతెల్లం చేసింది. దీని ద్వారా మనం ఎంతో నేర్చుకున్నాం.. అయితే మరెంతో నేర్చుకోవాల్సి ఉంది’’ అని తెలిపారు.

కొన్ని మారలేదు..

సామాజిక దూరం, చేతులు శుభ్రం చేసుకోవటం, సమూహాలలోకి వెళ్లక పోవటం, మాస్కులు ధరించటం వంటి నియమాలు మారలేదంటూ.. వాటిని పాటించాల్సిన అవసరాన్ని టెడ్రోస్‌ పునరుద్ఘాటించారు. అన్నిటిని మించి తాము, తోటివారు సురక్షితంగా ఉండాలనే దృఢ సంకల్పమే ముఖ్యమని అయన వెల్లడించారు. కరోనా కట్టడి, బాధితుల సంక్షేమం కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యక్తులు, సంస్థల వద్ద నుంచి 225 మిలియన్ల డాలర్లు, సభ్య దేశాల నుంచి 1 బిలియన్‌ డాలర్ల నిధిని సేకరించినట్లు ఆయన వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని