
‘మోడెర్నా’ టీకాకు ఎఫ్‌డీఏ ఆమోదం
వాషింగ్టన్: జీవసాంకేతిక దిగ్గజ సంస్థ ‘మోడెర్నా’ తయారుచేసిన కరోనా టీకా అత్యవసర వినియోగానికి అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్‌డీఏ) ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ప్రకటించారు.
ఇప్పటికే ఫైజర్ టీకా అత్యవసర వినియోగానికి అనుమతించిన ఎఫ్‌డీఐ తాజాగా మోడెర్నాకు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరో వైపు ఫైజర్‌లాగే మోడెర్నా కూడా ఒకే విధమైన పనితీరును కనబరిచే అవకాశముందని వైద్య రంగ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. కేసుల సంఖ్యతో పాటు మరణాల సంఖ్య అంతకంతకూ పెరుగుతండటంపై ఆందోళన చెందుతున్న అమెరికా టీకా అత్యవసర వినియోగం ద్వారా మరణాలను తగ్గించ వచ్చని భావిస్తోంది. ఎఫ్‌డీఐ అనుమతి లభించిన నేపథ్యంలో సోమవారం నుంచే బాధితులకు టీకా అదించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.‘ఎంఆర్‌ఎన్‌ఏ-1273’ పేరున సిద్ధం చేసిన వ్యాక్సిన్‌ను విస్తృతంగా సరఫరా చేసేందుకు మోడెర్నా సంస్థ ఇప్పటికే సిద్ధంగా ఉంది.
94.1% ప్రభావవంతం..
తాము తయారుచేసిన టీకా సురక్షితమని, 94.1% సమర్థంగా పనిచేస్తున్నట్టు క్లినికల్ పరీక్షల్లో తేలిందని మోడెర్నా వెల్లడించింది. దీని కారణంగా ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదని పేర్కొంది. ఇప్పటికే ఆమోదం పొందిన ఫైజర్ టీకాను మైనస్ 70 డిగ్రీల సెల్సియస్ వద్ద నిల్వ చేయాల్సి ఉండగా... మోడెర్నా వ్యాక్సిన్‌ను సాధారణ ఫ్రిజ్‌లో కూడా నిల్వ చేయవచ్చు. ప్రస్తుతం అమెరికాలో కరోనా తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. ఇప్పటివరకూ సుమారు 3.18 లక్షల మంది మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఇంకా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దీంతో వీలైనంత త్వరగా సాధారణ ప్రజలకు టీకాను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.