మరణాల రేటు భారత్‌లోనే తక్కువ..!

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభిస్తోన్న సమయంలో మరణాల రేటు భారత్‌లోని తక్కువని కేంద్ర ఆరోగ్యశాఖ మరోసారి స్పష్టం చేసింది.

Published : 25 Aug 2020 17:39 IST

వెల్లడించిన కేంద్ర ఆరోగ్యశాఖ

దిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభిస్తోన్న సమయంలో మరణాల రేటు భారత్‌లోనే తక్కువని కేంద్ర ఆరోగ్యశాఖ మరోసారి స్పష్టం చేసింది. ప్రపంచంలో తక్కువ కరోనా మరణాలు సంభవిస్తోన్న దేశాల్లో భారత్‌ ఒకటని పేర్కొంది. ప్రస్తుతం దేశంలో కరోనా మరణాల రేటు 1.58శాతం ఉండగా, మరో 22.2శాతం క్రియాశీల కేసులు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ వెల్లడించారు. యాక్టివ్‌ కేసుల కన్నా కోలుకున్న వారి సంఖ్యే 3.4రెట్లు అధికంగా ఉన్నట్లు మీడియా సమావేశంలో పేర్కొన్నారు.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా బాధితుల రికవరీ రేటు 75శాతం ఉందని తెలిపారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 3కోట్ల 68లక్షల శాంపిళ్లకు కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించామని రాజేశ్‌ భూషణ్‌ పేర్కొన్నారు. అంతేకాకుండా ఆగస్టు తొలి వారంలో కరోనా కేసుల పాజిటివిటీ రేటు 11శాతం ఉండగా ప్రస్తుతం అది 8శాతానికి తగ్గిందని స్పష్టంచేశారు. దేశవ్యాప్తంగా కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు పెరుగుతున్నప్పటికీ పాజిటివిటీ రేటు తగ్గడం ఊరట కలిగించే విషయమని రాజేశ్‌ భూషణ్‌ అభిప్రాయపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని