కేరళలో జార్జి ఫ్లాయిడ్‌ తరహా ఘటన?

కేరళలో చోటుచేసుకున్న ‘జార్జి ఫ్లాయిడ్‌’ మాదిరి సంఘటనపై సామాజిక మాధ్యమాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమౌతోంది.

Updated : 20 Jul 2021 18:27 IST

భగ్గుమంటున్న సోషల్‌ మీడియా

కోచి: కేరళలో చోటుచేసుకున్న ‘జార్జి ఫ్లాయిడ్‌’ మాదిరి సంఘటనపై సామాజిక మాధ్యమాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కేరళ పోలీసు అధికారి ఒకరు, ఓ వ్యక్తిని నేలకేసి అదిమిపెట్టి అతనిపై కూర్చున్న చిత్రం ఇంటర్నెట్‌లో చర్చనీయాంశమైంది. కేరళ ఉన్నత విద్యాశాఖ మంత్రి కే.టీ. జలీల్‌ కాన్వాయ్‌ వెళుతుండగా ఈ సంఘటన చోటుచేసుకున్నట్టు తెలిసింది.

ఇటీవల సంచలనం సృష్టించిన బంగారం స్మగ్లింగ్‌ కేసులో ఈడీ అధికారులు మంత్రి జలీల్‌ను ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో ఆయన రాజీనామా చేయాలంటూ ఆంటోనీ అనే కార్యకర్తతో సహా పలువురు కేరళ యువజన కాంగ్రెస్‌ సభ్యులు ఆదివారం సాయంత్రం నిరసన ప్రదర్శన చేపట్టారు. మంత్రి కాన్వాయ్‌ సమీపిస్తుండటంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు వెంటపడ్డారు. వారినుంచి తప్పించుకునేందుకు పరిగెడుతూ కింద పడిపోయిన ఆంటోనీ లేచేందుకు ప్రయత్నించారు. ఈ లోగా అక్కడకు చేరుకున్న ఓ పోలీసు అధికారి అటుగా వస్తున్న జలీల్‌ కాన్వాయ్‌ వెళ్లిపోయేవరకు అతనిని బలప్రయోగంతో నేలకు అదిమిపెట్టి ఉంచారు. ఇది గమనించిన ఆంటోనీ సహచరులు సంఘటనా స్థలానికి పరిగెత్తి వచ్చి అతనిని రక్షించారు.

కాగా ఈ సంఘటనకు సంబంధించిన చిత్రాన్ని కేరళ కాంగ్రెస్‌ నేత వీటీ బలరామ్‌ ‘‘ప్రజలు ఇంకా పినరయి ప్రభుత్వం..’’ అనే వ్యాఖ్యను జతచేస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేశారు. ఈ సంఘటనకు సంబంధించిన చిత్రాలు అమెరికాలో పోలీసుల దౌర్జన్యం వల్ల మరణించిన జార్జి ఫ్లాయిడ్‌ లాగా ఉండటంతో నెటిజన్లు తాజా ఘటనను ఆ ఉదంతంతో పోలుస్తూ తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని