పాకిస్థాన్‌ కుట్రలకు ఐరాసలో బ్రేక్‌!

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో పాకిస్తాన్‌కు మరోసారి చుక్కెదురైంది. ఉగ్రవాద కార్యకలాపాలకు మతం రంగుపూస్తూ, రాజకీయం చేయాలనుకున్న పాకిస్తాన్‌ ప్రయత్నాలను ఐరాస భద్రతా మండలి తిప్పికొట్టింది.

Updated : 03 Sep 2020 13:05 IST

భారతీయులను తీవ్రవాదులుగా చిత్రీకరించే ప్రయత్నం
అడ్డుకున్న భద్రతామండలి 
సభ్యదేశాలు

న్యూయార్క్: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో పాకిస్థాన్‌కు మరోసారి చుక్కెదురైంది. ఉగ్రవాద కార్యకలాపాలకు మతం రంగుపులుముతూ, రాజకీయం చేయాలనుకున్న పాకిస్థాన్‌ ప్రయత్నాలను ఐరాస భద్రతా మండలి తిప్పికొట్టింది. ఉగ్రవాద చర్యల పాల్పడుతున్నారంటూ ఇద్దరు భారతీయులను అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాలో చేర్చాలని చేసిన ప్రయత్నం బెడిసికొట్టిందని ఐరాసలో భారత్‌కు శాశ్వత ప్రతినిధిగా ఉన్న తిరుమూర్తి వెల్లడించారు.

భారతీయులను ఉగ్రవాదులుగా చిత్రీకరిస్తూ పాకిస్తాన్‌ ఐరాస తీవ్రవాద నిరోధక కమిటీ ముందు కొందరి పేర్లను ఉంచింది. ముఖ్యంగా విదేశాల్లో పలు అభివృద్ధి ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న వారిని అనుమానిస్తూ.. వారిని తీవ్రవాదుల జాబితాలో చేర్చాలని ప్రయత్నం చేసింది. అయితే, ఈ ఆరోపణలను భద్రతా మండలి ముందు రుజువు చేయలేకపోయింది. దీంతో సరైన ఆధారాలు ఇవ్వకపోవడంతోపాటు, అసత్య ఆరోపణలు చేసిన పాకిస్థాన్‌ చర్యను భద్రతా మండలిలో సభ్యదేశాలైన అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌, జర్మనీ, బెల్జియం అడ్డుకున్నాయి.

ఇటువంటి ప్రయత్నాలను పాక్‌ గతంలోనూ చేసింది. ఇద్దరు భారతీయులను తీవ్రవాద జాబితాలో చేర్చాలని గత సంవత్సరం చేసిన ప్రయత్నాలు భద్రతా మండలి ముందు విఫలమయ్యాయి. పాకిస్థాన్‌కు చెందిన మసూద్‌ అజర్‌ను అంతర్జాతీయ తీవ్రవాదిగా పేర్కొనడంలో భారత విజయం సాధించింది. దీంతో భారత్‌పై కక్షతో నిరాధార ఆరోపణలతో భారతీయులను తీవ్రవాదులుగా చిత్రీకరించే దుస్సాహసానికి ఒడిగట్టింది. అయితే, పాక్‌  ప్రయత్నాలను మాత్రం అంతర్జాతీయ వేదికలు తిప్పికొడుతూనే ఉన్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని