పోలాండ్‌ అధ్యక్షుడికి కరోనా!

పోలాండ్‌ అధ్యక్షుడు ఆండ్రేజ్ దుడా కరోనా వైరస్‌ బారినపడ్డారు.

Published : 24 Oct 2020 15:52 IST

వార్సా: సామాన్యుల నుంచి దేశాలధ్యక్షులపై కరోనా వైరస్‌ మహమ్మారి ప్రతాపం చూపిస్తూనే ఉంది. ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, యూకే ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ వైరస్‌ బారినపడిన విషయం తెలిసిందే. తాజాగా పోలాండ్‌ అధ్యక్షుడు ఆండ్రేజ్ దుడాకు వైరస్‌ సోకింది. ఈ విషయాన్ని పోలాండ్‌ విదేశాంగశాఖ మంత్రి బ్లేజెజ్‌ స్పైచాల్‌స్కీ వెల్లడించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు తెలిపారు. అయితే, దుడాకు వైరస్‌ ఎప్పుడు నిర్ధారణ అయ్యిందనే విషయాన్ని మాత్రం పోలాండ్‌ అధికారులు పేర్కొనలేదు. ఈ మధ్యే ఆయన బల్గేరియా అధ్యక్షుడు రుమెన్‌ రాదేవ్‌తో సమావేశమయ్యారు. దీంతో ప్రస్తుతం ఆయన కూడా క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు.

కరోనా వైరస్‌ ధాటికి యూరప్‌ దేశాలు వణికిపోతూనే ఉన్నాయి. ప్రస్తుతం మరో దఫా వైరస్‌ విజృంభణను యూరప్‌ దేశాలు ఎదుర్కొంటున్నాయి. యూకే, ఫ్రాన్స్‌, స్పెయిన్‌, జర్మనీ, సీజెక్‌ దేశాల్లో వైరస్‌ తీవ్రత మరింత పెరిగింది. ఇటు పోలాండ్‌లోనూ నిత్యం 13వేలకు పైగా పాజిటివ్‌ కేసులు బయటపడుతున్నాయి. మార్చి నెలతో పోలిస్తే ఇప్పుడే వైరస్‌ తీవ్రత అధికంగా ఉన్నట్లు స్థానిక ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. దీంతో ఇప్పటికే పలు ప్రాంతాలను రెడ్‌ జోన్లుగా గుర్తించి పూర్తి లాక్‌డౌన్‌ అమలుచేస్తున్నారు. ఇదిలా ఉంటే, పోలాండ్లో ఇప్పటివరకు 2లక్షల 28వేల మందిలో వైరస్‌ బయటపడగా వీరిలో 4వేలకుపైగా కొవిడ్‌ రోగులు ప్రాణాలు కోల్పోయారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని