సరిహద్దు వద్ద ఇప్పటికీ ఉద్రిక్తంగానే: రావత్ 

తీవ్రస్థాయి ఘర్షణలకు దారితీసే సరిహ్దదు వివాదాలు, రెచ్చగొట్టే చర్యల పట్ల ఉదాసీనంగా ఉండలేమని త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ స్పష్టం చేశారు.

Updated : 06 Nov 2020 16:00 IST

దిల్లీ: తీవ్రస్థాయి ఘర్షణలకు దారితీసే సరిహ్దదు వివాదాలు, రెచ్చగొట్టే చర్యల పట్ల ఉదాసీనంగా ఉండలమేని త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ స్పష్టం చేశారు. శుక్రవారం నేషనల్ డిఫెన్స్‌ కాలేజ్‌ నిర్వహించిన వెబినార్‌లో ఆయన మాట్లాడుతూ..ఇప్పటికీ  చైనాతో సరిహద్దు వెంబడి పరిస్థితి ఉద్రిక్తంగానే ఉన్నట్లు అంగీకరించారు. గత కొద్ది నెలలుగా భారత్‌, చైనా సరిహద్దులో నెలకొన్న ప్రతిష్టంభన ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. 

ఈ క్రమంలో బిపిన్‌ రావత్ మాట్లాడుతూ..భారత దళాల నుంచి గట్టి స్పందన రావడంతో చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఊహించని పరిణామాలను ఎదుర్కొందన్నారు. సరిహద్దు వద్ద సైన్యం దృఢంగా నిలబడి ఉందని, వాస్తవాధీన రేఖలో ఎటువంటి మార్పును తాము అంగీకరించబోమని స్పష్టం చేశారు. ‘భారత్ ప్రాముఖ్యత పెరుగుతున్నప్పుడు దానికి తగ్గట్టే భద్రతా సవాళ్లు కూడా పెరుగుతాయి. మన సైనిక అవసరాల కోసం ఇతర దేశాలపై ఆధారపడటం నుంచి బయటపడాలి. ప్రస్తుతం, భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనే లక్ష్యంతో..దీర్ఘకాలిక స్వదేశీ సామర్థ్యాన్ని పెంపొందించుకునేందుకు పెట్టుబడి పెట్టాలి’ అని అన్నారు. అలాగే దాయాది దేశం పాకిస్థాన్ గురించి మాట్లాడుతూ.. పాక్‌ ప్రేరేపిత  ఉగ్రవాద కార్యకలాపాల కారణంగా ఆ దేశంతో సంబంధాలు మునుపటి కంటే దిగజారాయన్నారు. ఇదిలా ఉండగా, మే నెలలో సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులకు ముగింపు పలికే లక్ష్యంతో ఇప్పటికే భారత్, చైనా మధ్య ఏడు రౌండ్ల చర్చలు జరిగాయి. ఈ రోజు మరోమారు ఇరు దేశాలకు చెందిన అధికారుల మధ్య చర్చలు జరుగుతున్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకునే రావత్ భారత్ వైఖరి వెల్లడించారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని