మోదీ ఎన్నికపై సవాలు..తిరస్కరించిన సుప్రీం

వారణాసి లోక్‌సభ స్థానం నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై పోటీ చేసేందుకు ప్రయత్నించి విఫలమైన మాజీ జవాను పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది.

Updated : 24 Nov 2020 18:50 IST

దిల్లీ: వారణాసి లోక్‌సభ స్థానం నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై పోటీ చేసేందుకు ప్రయత్నించి విఫలమైన మాజీ జవాను వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఇప్పటికే ఆయన పిటిషన్‌ను కొట్టివేస్తూ అలహాబాద్‌ హైకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. అప్పీలులో భాగంగా పూర్తి విచారణ అనంతరం, తీర్పు రిజర్వులో ఉంచిన భారత ప్రధానన్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం తాజాగా ఈ నిర్ణయాన్ని వెలువరించింది.

బీఎస్‌ఎఫ్‌ విభాగం నుంచి తొలగించిన కానిస్టేబుల్‌ తేజ్‌ బహదూర్‌ గత సంవత్సరంలో జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో మోదీపై పోటీకి సిద్ధమయ్యారు. సమాజ్‌వాదీ పార్టీ తరఫున నామినేషన్‌ వేశారు. అయితే, తప్పుడు సమాచారం కారణంగా ఎన్నికల అధికారి ఈయన నామినేషన్‌ను తిరస్కరించారు. తన నామినేషన్‌ పత్రాలను ఎన్నికల కమిషన్‌ తప్పుగా తిరస్కరించిందంటూ తేజ్‌ బహదూర్‌ హైకోర్టులో పిటిషన్‌ను దాఖలు చేశారు. దీంతో మోదీ ఎన్నిక కూడా చెల్లదని పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే, ఎన్నికల అధికారి నిర్ణయాన్ని సమర్థించిన కోర్టు, తేజ్‌ బహదూర్‌ పిటిషన్‌ను తిరస్కరించింది. తేజ్ బహదూర్ లోక్‌సభ ఎన్నికల్లో అభ్యర్థి కాదని, దీంతో గెలుపొందిన వ్యక్తి ఎన్నికను సవాలు చేసే అర్హత ఆయనకు లేదని అలహాబాద్‌ హైకోర్టు అభిప్రాయపడింది. అనంతరం తేజ్ బహదూర్‌‌ దీనిపై సుప్రీంకోర్టులో అప్పీలు చేసుకోగా, అక్కడ కూడా ఆయనకు చుక్కెదురైంది.

ఇదిలాఉంటే, సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్‌)లో పనిచేస్తున్న సమయంలో తేజ్‌ బహదూర్‌ విడుదల చేసిన వీడియో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. సైనికులకు నాసిరకం ఆహారం ఇస్తున్నారని ఆరోపిస్తూ ఓ వీడియోను విడుదల చేశారు. ఆ సమయంలో అది దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యింది. అనంతరం విచారణ చేపట్టిన సైనికాధికారులు ఆయనను విధుల నుంచి తొలగించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని