కరోనా.. కేరళకు ఏమైంది?

భారతదేశంలో తొలి కరోనా కేసు నమోదైన రాష్ట్రం కేరళ. తొలి మరణమూ అక్కడే. ఆ రాష్ట్రానికి విదేశీ రాకపోకలూ ఎక్కువే. వరదల వల్ల అప్పటికే అతలాకుతలమైన కేరళలో మరోసారి భారీగా ప్రాణనష్టం జరుగుతుందని భావించారంతా. కానీ, అందరి ఆలోచనలనూ తలకిందులు చేస్తూ కరోనా వ్యాప్తిని చాలా వరకు అరికట్టగలిగింది...

Updated : 27 Sep 2020 08:54 IST

భారీగా పెరుగుతున్న కేసులు

భారతదేశంలో తొలి కరోనా కేసు నమోదైన రాష్ట్రం కేరళ. తొలి మరణమూ అక్కడే. ఆ రాష్ట్రానికి విదేశీ రాకపోకలూ ఎక్కువే. వరదల వల్ల అప్పటికే అతలాకుతలమైన కేరళలో మరోసారి భారీగా ప్రాణనష్టం జరుగుతుందని భావించారంతా. కానీ, అందరి ఆలోచనలనూ తలకిందులు చేస్తూ కరోనా వ్యాప్తిని చాలా వరకు అరికట్టగలిగింది. విపత్తును ముందుగానే ఊహించి, అధికారులను అప్రమత్తం చేసి, తగిన చర్యలు చేపట్టిన ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి కేకే శైలజను ఐక్యరాజ్య సమితి కూడా ప్రశంసించింది. అయితే తాజాగా గత వారం రోజులుగా కేరళలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. కారణమేంటి?

 మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలతో పోల్చుకుంటే కేరళలో రోజువారీ నమోదవుతున్న కేసులు స్వల్పమే. అయితే కొత్త కేసులు నమోదవుతున్న రేటు మాత్రం చాలా ఎక్కువగా ఉంది. దేశ వ్యాప్తంగా పెరుగుతున్న కేసుల రేటు 1.53శాతం కాగా.. కేరళలో ఇది దాదాపు రెట్టింపు కంటే ఎక్కువగా 3.51 శాతం ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు 1.12 లక్షల కేసులు ఉన్నాయి. ఇదే పెరుగుదల రేటు కొనసాగితే..దేశంలోనే అత్యంత ఎక్కువ కేసులు కలిగిన తొలి 10 రాష్ట్రాల్లో కేరళ నిలిచే అవకాశమూ లేకపోలేదు. కొత్తగా అత్యధిక కేసులు నమోదవుతున్న రాష్ట్రాల్లో కేరళ నాలుగో స్థానంలో ఉంది. మరోవైపు క్రియాశీల కేసుల సంఖ్య కూడా కేరళలో అధికంగానే ఉంది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం కనీసం 49,000 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇది దేశంలోనే ఐదో స్థానం. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ దీని ముందుస్థానాల్లో ఉన్నాయి.

ముఖ్యమంత్రి ఆందోళన

కరోనా వ్యాప్తిపై ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ స్వయంగా ఆందోళన వ్యక్తం చేయడం ఆ రాష్ట్రంలో వైరస్‌ వ్యాప్తికి అద్దం పడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో చాలా ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయని, ప్రజలంతా విషమ పరిస్థితుల్లోకి జారుకుంటున్నామని ఆయన హెచ్చరించారు. కేరళలో తాజా పరిస్థితులపై ఐఐఎం కోలికోడ్‌ ప్రొఫెసర్‌ జాన్‌ కూడా స్పందించారు. గతంలో పరీక్షలు తక్కువగా నిర్వహించడం వల్ల పాజిటివ్‌ కేసుల సంఖ్య తగ్గిందని, దాని ప్రభావం ఇప్పుడు కనిపిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పటికీ కేరళలో కరోనా పరీక్షల సంఖ్యను పెంచడం లేదని ఆయన చెప్పారు. విస్తృతంగా కరోనా పరీక్షలు చేయకపోతే వైరస్‌కు అడ్డుకట్ట వేయడం సాధ్యం కాదని ఆయన అంటున్నారు.

అదీ కారణం కావొచ్చు!

నిజానికి కేరళలో కరోనా నిర్ధారణ పరీక్షలు చాలా తక్కువ. దాదాపు 3.48 కోట్ల జనాభాలో ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఇప్పటి వరకు కేవలం 26.57 లక్షల మందికే పరీక్షలు నిర్వహించారు. అందులో గత మూడురోజుల్లోనే 50,000 శాంపిళ్లను పరీక్షించారు. ఎక్కువ శాంపిళ్లను పరీక్షించడం వల్లే పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు రాష్ట్రంలో అన్‌లాక్‌ ప్రక్రియను చేపడుతుండం కూడా కేసుల పెరుగుదలకు కారణం కావచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు. లాక్‌డౌన్‌ను సమర్థంగా అమలు చేసిన రాష్ట్రాల్లో కేరళ కూడా ఉంది. అప్పటి వరకు సామాజిక దూరం పాటిస్తూ, ఇళ్లకే పరిమితమైన జనాలు లాక్‌డౌన్‌ను సడలించడంతో నియమాలను పక్కనపెడుతున్నారని మరికొంతమంది వాపోతున్నారు. ఏదిఏమైనా ఇప్పటికైనా కోలుకొని సరైన నివారణ చర్యలు అమలు చేయకపోతే కేరళలో కరోనా విలయ తాండవం చేయడం ఖాయమనిపిస్తోంది.

-ఇంటర్నెట్‌డెస్క్

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని