Resort murder: యువతి మిత్రుడిని తప్పుదోవ పట్టించేందుకు యత్నం..!

ఉత్తరాఖండ్‌లో యువతి హత్యకేసులో కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. నిందితుడు పులకిత్‌ ఆర్య సదరు యువతి మిత్రుడైన పుష్ప్‌ను తప్పుదోవ పట్టించేందుకు యత్నించినట్లు తేలింది.

Updated : 25 Sep 2022 14:53 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఉత్తరాఖండ్‌లో యువతి హత్యకేసులో కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. నిందితుడు పుల్కిత్‌ ఆర్య సదరు యువతి మిత్రుడైన పుష్ప్‌ను తప్పుదోవ పట్టించేందుకు యత్నించినట్లు తేలింది. ఈ మేరకు పుల్కిత్‌ కాల్‌ రికార్డింగ్‌లు వెలుగు చూశాయి. వీటిల్లో  ఒక సారి పుష్ప్‌తో మాట్లాడుతూ ‘‘మేము అంకితతో కలిసి రిషికేశ్‌కు వెళ్లి రాత్రి తొమ్మిదింటికి రిసార్ట్‌కు వచ్చాము. అంకితా మాతో కలిసి డిన్నర్‌ కూడా చేసింది. కానీ, మర్నాడు ఉదయం నుంచి ఆమె గది నుంచి అదృశ్యమైంది. అప్పటి నుంచి ఆమె కోసం వెతుకుతున్నాం’’ అని పేర్కొన్నాడు. 

మరో కాల్‌లో పుల్కిత్‌ ఏకంగా పుష్ప్‌పైనే అనుమానం వ్యక్తం చేయడం గమనార్హం. ఆ కాల్‌లో పుల్కిత్‌ మాట్లాడుతూ ‘‘అంకిత నీ వద్ద ఉందా..? ఆమె ఎప్పుడూ నీగురించి మాట్లాడుతుంటుంది’’ అని అడిగాడు. దీనికి పుష్ప్‌ సమాధానం చెబుతూ ‘‘నేను చాలా దూరంలో ఉన్నాను. మీ వద్ద ఉన్న ఆమె ఇంత దూరం ఎలా వస్తుంది. ముందు మీరు ఆమె కోసం వెతకండి.. లేకపోతే సమస్యల్లో చిక్కుకొంటారు’’ అని హెచ్చరించాడు. వాస్తవానికి హత్య జరిగిన రోజు పుష్ప్‌కు రాత్రి 8.30 కాల్‌ చేస్తానని అంకిత పేర్కొంది. కానీ, ఫోన్‌ రాకపోవడంతో అతడే పుల్కిత్‌, అంకిత, భాస్కర్‌కు ఫోన్లు చేశాడు. 

నా కుమారుడు నిర్దోషి..!

అంకిత హత్యలో ప్రధాన నిందితుడైన పుల్కిత్‌ ఆర్యపై వస్తున్న ఆరోపణలను తండ్రి వినోద్‌ ఆర్య తోసిపుచ్చాడు. తన కుమారుడు సాధారణ యువకుడని పేర్కొన్నాడు. అతడికి ఎప్పుడూ వ్యాపారంపైనే ధ్యాస అని వివరించాడు. పుల్కిత్‌, అంకిత ఇద్దరికీ న్యాయం జరగాలని తాను కోరుకుంటున్నట్లు వివరించాడు. అతను తమ నుంచి వేరుగా జీవిస్తున్నాడని పేర్కొన్నారు. 

యువతి హత్యకేసులో రిసార్టు యజమాని పుల్కిత్‌ ఆర్య, అతడి సిబ్బంది అరెస్టయ్యారు. సదరు యువతి రిసార్టుకు వచ్చే అతిథులకు ‘ప్రత్యేక’ సేవలు అందించేందుకు నిరాకరించడం వల్లే వారు ఈ హత్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని