Amarnath yatra: అమర్‌నాథ్‌ యాత్ర రద్దు

ఈ నెల 28 నుంచి ప్రారంభం కావాల్సిన అమర్‌నాథ్‌ యాత్ర రద్దైంది. కరోనా మహమ్మారితో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఈ ఏడాది కూడా యాత్రను రద్దు చేస్తున్నట్టు జమ్మూకశ్మీర్‌ .....

Updated : 21 Jun 2021 18:37 IST

దిల్లీ: ఈ నెల 28 నుంచి ప్రారంభం కావాల్సిన అమర్‌నాథ్‌ యాత్ర రద్దైంది. కరోనా మహమ్మారితో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఈ ఏడాది కూడా యాత్రను రద్దు చేస్తున్నట్టు జమ్మూకశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా కార్యాలయం ప్రకటించింది. ఈ ఏడాది యాత్ర కోసం ఏప్రిల్‌ 1నుంచి నమోదు ప్రక్రియ మొదలు పెట్టినప్పటికీ కరోనా సెకండ్‌ వేవ్‌ ఉగ్రరూపంతో రిజిస్ట్రేషన్లను తాత్కాలికంగా నిలిపివేశారు.

కరోనా మహమ్మారి నేపథ్యంలో అమర్‌నాథ్‌ యాత్ర రద్దు చేస్తున్నట్టు జమ్మూకశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కార్యాలయం వెల్లడించింది. అమర్‌నాథ్‌ పుణ్యక్షేత్రం బోర్డు సభ్యులతో చర్చించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ప్రజల ప్రాణాలు కాపాడటమే ముఖ్యమని, వారి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఈ ఏడాది యాత్రను రద్దు చేస్తున్నట్టు ట్విటర్‌లో పేర్కొంది. యాత్ర రద్దైనప్పటికీ ఎప్పటిలాగే ఆలయంలో సంప్రదాయ పూజా కార్యక్రమాలు కొనసాగుతాయని పేర్కొంది. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో శుక్రవారం జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో అమర్‌నాథ్‌ యాత్ర రద్దుపై చర్చించారు.

దక్షిణ కశ్మీర్‌లోని హిమాలయాల్లోని అమర్‌నాథుడిని దర్శించుకొనేందుకు ఏటా నిర్వహించే ఈ యాత్రకు భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. మొత్తం 56 రోజుల పాటు సాగే ఈ యాత్ర ఈ ఏడాది జూన్‌ 28 నుంచి ఆగస్టు 22 వరకు జరగాల్సి ఉంది.  2019లో ఆర్టికల్‌ 370 రద్దు సందర్భంగానూ యాత్రను కుదించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని