Mamata Banerjee: అమర్త్యసేన్‌ సలహా నాకు ‘ఆజ్ఞ’ వంటిది : మమతా బెనర్జీ

ప్రధానమంత్రి అయ్యేందుకు మమతా బెనర్జీకి అన్ని సామర్థ్యాలున్నాయని ప్రముఖ ఆర్థికవేత్త అమర్త్యసేన్‌ చెప్పడంపై పశ్చిమబెంగాల్‌ సీఎం స్పందించారు. ఆయన సలహా తనకు ఆజ్ఞ వంటిదన్న ఆమె.. దేశ పరిస్థితులపై ఆయన విశ్లేషణను సీరియస్‌గా తీసుకోవాలన్నారు. 

Published : 17 Jan 2023 01:40 IST

కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ (TMC) అధినేత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee)కి తదుపరి ప్రధాని అయ్యే సామర్థ్యం ఉందని నోబెల్‌ గ్రహీత అమర్త్యసేన్‌ వెల్లడించిన సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై మమతా బెనర్జీ స్పందించారు. అమర్త్యసేన్‌ ఇచ్చిన సలహా నాకు ఆజ్ఞ వంటిదన్నారు. ఓ వార్తా ఛానల్‌తో మాట్లాడిన దీదీ.. ప్రపంచ ప్రఖ్యాత ఆర్థికవేత్త ఆలోచనలు తమకు మార్గాన్ని చూపుతాయని అన్నారు. ‘అమర్త్యసేన్‌ సూచన నాకు ఆజ్ఞ వంటిది. ఆయన ఆలోచనలు, దేశ ప్రస్తుత పరిస్థితుల విశ్లేషణను ప్రతిఒక్కరూ సీరియస్‌గా తీసుకోవాలి’ అని మమతా బెనర్జీ స్పష్టం చేశారు.

ఇదిలాఉంటే, 2024 సార్వత్రిక ఎన్నికలు పూర్తిగా భాజపాకు అనుకూలంగా ఉంటాయని భావించడం పొరబాటే అవుతుందని ఇటీవల ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమర్త్యసేన్ పేర్కొన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలే కీలక పాత్ర పోషిస్తాయని అభిప్రాయపడిన ఆయన.. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి తదుపరి ప్రధాని అయ్యే సామర్థ్యం ఉందని వెల్లడించారు. వీటిపై భాజపా కూడా స్పందించింది. ప్రస్తుతం ప్రధాని పదవి ఖాళీగా లేదని.. వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏ విజయం సాధిస్తుందని పేర్కొంది.

గంగాసాగర్‌ మేళాకు కేంద్రం మొండిచేయి..

పశ్చిమబెంగాల్‌లో ప్రతిఏటా లక్షల మంది భక్తులు వచ్చే గంగాసాగర్‌ మేళాకు కేంద్ర ప్రభుత్వం ఎటువంటి సహాయం అందించడం లేదని మమతా బెనర్జీ ఆరోపించారు. అయినప్పటికీ సాధ్యమైనంత వరకూ తమ ప్రభుత్వం ఆ ఖర్చులను భరిస్తుందని చెప్పారు. ఈ ఏడాది 70లక్షల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారని అన్నారు. ఇంతటి భారీ మేళాను జాతీయ పండుగగా గుర్తించాలని కోరినప్పటికీ కేంద్ర ప్రభుత్వం నుంచి స్పందన లేదన్నారు. ఈ ఉత్సవాలకు కేంద్రం కనీసం చిల్లిగవ్వ కూడా సహాయం చేయలేదని దుయ్యబట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని