Ukraine Crisis: మరో 600మంది సురక్షితంగా భారత్‌కు..ప్రమాదకర ప్రాంతాల్లో ఇంకా 1000 మంది!

రష్యా దాడులతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయుల్లో మరో 629 మంది శనివారం వేకువజామున మనదేశానికి సురక్షితంగా చేరుకున్నారు....

Updated : 05 Mar 2022 10:53 IST

దిల్లీ: రష్యా దాడులతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయుల్లో మరో 629 మంది శనివారం వేకువజామున మనదేశానికి సురక్షితంగా చేరుకున్నారు. ఆపరేషన్‌ గంగ పేరిట చేపట్టిన ఈ తరలింపు కార్యక్రమంలో భాగంగా భారత వాయుసేన (IAF) కు చెందిన విమానాలు రొమేనియా, స్లొవేకియా, పోలండ్‌ నుంచి 629 మందిని ఉత్తర్‌ప్రదేశ్‌లోని హిండన్‌ విమాన స్థావరానికి చేర్చాయి. భారత్‌ నుంచి వెళ్లేటప్పుడు ఈ విమానాలు సహాయక చర్యలకు సంబంధించిన 16.5 టన్నుల సామగ్రిని తీసుకెళ్లాయి.

ఆపరేషన్‌ గంగ (Operation Ganga) లో భాగంగా ఇప్పటి వరకు భారత వాయుసేనకు చెందిన విమానాలు ఆయా దేశాలకు 10 చక్కర్లు కొట్టినట్లు ఓ ప్రకటనలో అధికారులు తెలిపారు. మొత్తం 2,056 మందిని సురక్షితంగా తీసుకొచ్చామన్నారు. సీ-17 భారీ ప్రయాణ వాహనాన్ని దీనికి వినియోగిస్తున్నట్లు తెలిపారు. ఇంకా 2000-3000 మంది భారతీయులు ఉక్రెయిన్‌ (Ukraine)లో ఉన్నట్లు అంచనా ఉందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్‌ బాగ్చీ వెల్లడించారు. వారందరినీ స్వదేశానికి చేర్చుతామని హామీ ఇచ్చారు.

ప్రమాదకర ప్రాంతాల్లో ఇంకా 1000 మంది...

మరోవైపు పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్న తూర్పు ఉక్రెయిన్‌లో ఇంకా 1000 మంది భారతీయులు ఉన్నట్లు ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. 700 మంది సుమీలో, 300 మంది ఖర్కివ్‌లో ఉన్నట్లు తెలిపింది. వారందరినీ సురక్షితంగా భారత్‌కు చేర్చడంపైనే ప్రధానంగా దృష్టి సారించామన్నారు. వారందరినీ అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

* భారతీయుల తరలింపు కార్యక్రమంలో ఈరోజు ప్రైవేటు విమానాలు 11, ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌కు చెందిన 4 విమానాలు పాల్గొంటాయని విమానయాన మంత్రిత్వశాఖ శుక్రవారం వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని