Arya Samaj: ఆర్య సమాజ్‌ పెళ్లిళ్లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

ఆర్య సమాజ్‌లో జరిగే వివాహాలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఆర్య సమాజ్‌ జారీ చేసే వివాహ ధ్రువీకరణ

Updated : 03 Jun 2022 18:19 IST

దిల్లీ: ఆర్య సమాజ్‌(Arya Samaj)లో జరిగే వివాహాలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఆర్య సమాజ్‌ జారీ చేసే వివాహ ధ్రువీకరణ పత్రాలు చెల్లవని స్పష్టం చేసింది. అలాంటి సర్టిఫికేట్లు ఇవ్వడం ఆర్య సమాజ్‌ పని కాదని తేల్చి చెప్పింది. మధ్యప్రదేశ్‌లో ఓ ప్రేమపెళ్లిపై నమోదైన కేసు విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ తీర్పు చెప్పింది.

ఓ యువకుడు తమ కుమార్తెను కిడ్నాప్‌ చేసి, అత్యాచారానికి పాల్పడ్డాడంటూ మధ్యప్రదేశ్‌లో ఓ బాలిక కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. తమ కుమార్తె మైనర్‌ అని పేర్కొంది. ఆ ఫిర్యాదు మేరకు పోలీసులు సదరు యువకుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. దీంతో ఈ కేసును సవాల్‌ చేస్తూ ఆ యువకుడు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఆ బాలిక మేజరేనని.. ఇష్టపూర్వకంగానే ఇంటి నుంచి వచ్చేసి తనను పెళ్లి చేసుకుందని యువకుడు తన పిటిషన్‌లో పేర్కొన్నాడు. తమ వివాహం ఆర్య సమాజ్‌ మందిర్‌లో జరిగిందని చెప్పిన అతడు.. కేంద్ర భారతీయ ఆర్య ప్రతినిధి సభ జారీ చేసిన వివాహ ధ్రువీకరణ పత్రాన్ని కూడా కోర్టుకు సమర్పించాడు.

అయితే, ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్‌ అజయ్‌ రస్తోగి, జస్టిస్‌ బి.వి. నాగరత్నలతో కూడిన ధర్మాసనం.. ఆ వివాహ ధ్రువీకరణ పత్రాన్ని తిరస్కరించింది. ‘‘వివాహ ధ్రువీకరణ పత్రాలు జారీ చేయడం ఆర్య సమాజ్‌ పని కాదు. ఆ అర్హత వాటికి లేదు. కేవలం చట్టపరంగా ఉన్న అధికారులు మాత్రమే ఆ సర్టిఫికేట్లను జారీ చేయాలి. మీ కేసులో అలాంటి ధ్రువపత్రాలు ఉంటే తీసుకురండి’’ అని ధర్మాసనం స్పష్టం చేసింది.

ఆర్య సమాజ్‌ అనేది హిందూ సంస్కరణల సంస్థ. దీన్ని 1875లో స్వామి దయానంద్‌ సరస్వతి ఏర్పాటు చేశారు. సనాతన హిందూమతంలో సంస్కరణలు తీసుకురావాలని, వేదాలపై విశ్వాసంతో విలువలను ప్రోత్సాహించాలనే ఉద్దేశంతో ఈ సమాజ్‌ను స్థాపించారు. అదే సమయంలో పౌరుల హక్కుల కోసం ఈ సంస్థ పనిచేస్తోంది. కులాంతర వివాహాలను ఆర్య సమాజ్‌ ప్రోత్సహిస్తుంది. అందుకే ప్రేమ పెళ్లిళ్లకు ఇది వేదికగా మారింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని