
Afghanistan: పనికి గోధుమల పథకం.. ఆకలి చావులు తప్పించేందుకే!
కాబుల్: ఆర్థిక సంక్షోభం, నిరుద్యోగం, ఆకలి కేకలతో అల్లాడుతున్న అఫ్గాన్ ప్రజలకు తాత్కాలిక ఉపశమనం కల్పించేందుకు తాలిబన్ ప్రభుత్వం ముందుకొచ్చింది. పౌరుల ఆకలి బాధను తీర్చేందుకు కొత్తగా ‘పనికి గోధుమల పంపిణీ’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా చేసిన పనికి డబ్బుకు బదులుగా గోధుమలను అందించనుంది. అఫ్గాన్‌లోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో ఈ పథకం అమలు చేయనున్నట్లు తాలిబన్ల అధికార ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ తెలిపారు. ఒక్క కాబుల్‌లోనే 40 వేల మందికి లబ్ధి చేకూరనున్నట్లు వెల్లడించారు. ఆదివారం ముజాహిద్‌తోపాటు వ్యవసాయ మంత్రి అబ్దుల్ రెహ్మాన్ రషీద్, కాబుల్ మేయర్ హమ్‌దుల్లా నోమాని తదితరులు కాబుల్‌లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి, చిన్న గుంతను తవ్వారు. నిరుద్యోగ సమస్యపై పోరాటంలో ఇది ఒక ప్రధాన అడుగు అని అన్నారు.
55 వేల టన్నుల సరఫరా..
ఇప్పటికే పేదరికం, కరవు పరిస్థితులు, కరెంటు కోతలు, ఆర్థిక సంక్షోభంతో కుదేలవుతున్న అఫ్గానిస్థాన్‌లో ప్రస్తుతం తీవ్రమైన చలికాలం ప్రారంభ దశలో ఉండటంతో కష్టాలు రెట్టింపయ్యాయి. నిరుద్యోగం కారణంగా ప్రజలకు ఆదాయం లేకపోవడంతో ఆకలి చావులు మొదలయ్యాయి. ఇటీవల పశ్చిమ కాబూల్‌లో ఎనిమిది మంది చిన్నారులు ఆకలితో చనిపోయినట్లు సమాచారం. శీతాకాలంలో ఈ సమస్య మరింత తీవ్రమై, పెద్ద సంఖ్యలో మరణాలు నమోదయ్యే ప్రమాదం ఉన్నందున ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టినట్లు తెలుస్తోంది. రెండు నెలలపాటు కొనసాగనున్న ఈ కార్యక్రమంలో భాగంగా కాబుల్‌లో 11,600 టన్నుల గోధుమలు పంపిణీ చేయనున్నారు. హెరాత్, జలాలాబాద్, కాందహార్, మజారే షరీఫ్ తదితర ప్రాంతాల్లో దాదాపు 55 వేల టన్నులు పంచనున్నారు. పనిలో భాగంగా కరవు పరిస్థితులను ఎదుర్కొనేందుకు వీలుగా నీటి కాలువలు, క్యాచ్‌మెంట్ టెర్రస్‌ల నిర్మాణం చేపట్టనున్నారు.
ఇవీ చదవండి
Advertisement