వంద రోజుల్లో.. 10కోట్ల మందికి టీకా: బైడెన్‌

అమెరికా అధ్యక్షుడిగా తాను బాధ్యతలు చేపట్టాక తొలి వంద రోజుల్లో 10కోట్ల మందికి కొవిడ్‌ వ్యాక్సిన్‌ అందజేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు జో బైడెన్‌ వెల్లడించారు. ఈ మేరకు ఆయన గతేడాది నుంచి దేశంలో నెలకొన్న ఆరోగ్య సంక్షోభంపై శుక్రవారం తన బృందంతో నిర్వహించిన సమావేశంలో చర్చించారు.

Updated : 16 Jan 2021 17:37 IST

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడిగా తాను బాధ్యతలు చేపట్టాక తొలి వంద రోజుల్లో 10కోట్ల మందికి కొవిడ్‌ వ్యాక్సిన్‌ అందజేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు జో బైడెన్‌ వెల్లడించారు. ఈ మేరకు ఆయన గతేడాది నుంచి దేశంలో నెలకొన్న ఆరోగ్య సంక్షోభంపై శుక్రవారం తన బృందంతో నిర్వహించిన సమావేశంలో చర్చించారు. ‘దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ఘోరంగా విఫలమైంది. మేం బాధ్యతలు చేపట్టాక తొలి వంద రోజుల్లోనే 10కోట్ల మందికి వ్యాక్సిన్‌ అందజేయడం మా లక్ష్యంగా పెట్టుకున్నాం. అలా చేయడం సాధ్యమయ్యే పనేనా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. కానీ మేం దాన్ని చేసి చూపిస్తాం. లక్ష్యాలను ధైర్యంతో అధిగమించాల్సిన తరుణమిది. ఎందుకంటే ప్రస్తుతం మన దేశ ఆరోగ్యం ప్రమాదంలో ఉంది. ప్రాధాన్యతా విభాగాల ప్రకారం.. వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగంగా పూర్తి చేసేందుకు రాష్ట్రాలతో కలిసి పనిచేస్తాం. మరింత మందికి వ్యాక్సిన్‌ అందజేసేలా రాష్ట్రాలను ప్రోత్సహించి ప్రక్రియలో ఉన్న సమస్యల్ని అధిగమిస్తాం. వ్యాక్సిన్‌ అందుబాటును దృష్టిలో ఉంచుకుని ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌కు టీకాలను కొనసాగిస్తూనే.. దేశవ్యాప్తంగా ఫార్మసీల వినియోగాన్ని పెంచుతాం. అంతేకాకుండా మొబైల్‌ క్లినిక్‌లను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుని ప్రక్రియ వేగవంతం అయ్యేలా కృషి చేస్తాం’ అని జో తెలిపారు. 

టీకాలు అందుబాటులో ఉన్నప్పటికీ.. ట్రంప్‌ ప్రభుత్వం సగంలోనే నిలిపివేయడం అర్థరహితమని బైడెన్‌ ఈ సందర్భంగా ఆరోపణలు చేశారు. టీకాల అందుబాటును దృష్టిలో పెట్టుకుని తమ ప్రభుత్వం భారీ స్థాయిలో టీకాలను విడుదల చేస్తుందని.. అంతేకాకుండా అత్యవసర సమయాల కోసం కొంత నిల్వను కూడా పెట్టుకుంటుందని చెప్పారు. ఈ ప్రక్రియలో మంచి లేదా చెడు ఏది ఎదురైనా తమ ప్రభుత్వం పక్షపాతం లేకుండా వ్యవహరిస్తుందన్నారు. 

మాస్కులు నిరాకరించడం దిగ్భ్రాంతికి గురిచేసింది
‘యూఎస్‌ కాంగ్రెస్‌కు చెందిన మహిళా సభ్యురాలు లీసా బ్లంట్‌ రోచెస్టర్‌ను చూసి నేనెంతో గర్విస్తున్నా. క్యాపిటల్‌పై దుండగులు విధ్వంసానికి పాల్పడుతున్నప్పుడు.. ఆమె రిపబ్లికన్లను మాస్కులు ధరించమని సూచించారు. కానీ రిపబ్లికన్‌ నాయకులు ఆమె మాట ప్రకారం మాస్కులు ధరించేందుకు నిరాకరించారు. వారి ప్రవర్తనను చూసి ఎంతో ఆందోళనకు గురయ్యాను. కరోనా వైరస్‌ ముప్పు ఉన్నప్పటికీ.. మాస్కులు ధరించేందుకు నిరాకరించడం ఏంటి? వారి ప్రవర్తన వల్ల ఈ రోజు నలుగురు కాంగ్రెస్‌ సభ్యులు కరోనా వైరస్‌ బారిన పడ్డారు. అందులో క్యాన్సర్‌ బాధితులు కూడా ఉన్నారు. మాస్కు ఎవరి కోసం వారు ధరించకపోయినా.. మిమ్మల్ని ప్రేమించే వారికోసం, దేశం కోసం ధరించండి’ అని బైడెన్‌ సూచించారు. 

‘ఇది రాజకీయాలకు సంబంధించిన విషయం కాదని.. జీవితాలను కాపాడే విషయమని మనం తెలుసుకోవాలి. చేతులు శుభ్రంగా కడుక్కోవడం, సామాజిక దూరం పాటించడం, బహిరంగ సమావేశాలకు హాజరుకాకపోవడం వంటి విషయాలను పాటించడం మంచిది. మనం ప్రస్తుతం కరోనా వైరస్‌తో పోరాటం చేస్తున్నాం. ఏప్రిల్‌ వరకూ మాస్కులు ధరించాలని నిపుణులు చెబుతున్నారు. దాని ద్వారా దాదాపు 50వేల మంది ప్రాణాలను నిలుపుకోవచ్చు అని నిపుణులు తెలిపారు. కాబట్టి వారు సూచించినట్లుగా రాబోయే వంద రోజుల పాటు తప్పనిసరిగా మాస్కు ధరించాలని కోరుతున్నాం’ అని బైడెన్‌ విజ్ఞప్తి చేశారు. జనవరి 6న ట్రంప్‌ మద్దతుదారులు క్యాపిటల్‌ భవనంపై దాడికి దిగిన విషయం తెలిసిందే.   కాగా యూఎస్‌లో ఇప్పటివరకూ 2.35 కోట్ల మంది కరోనా బారిన పడగా.. 3.92లక్షల మంది మహమ్మారి కారణంగా ప్రాణాలు వదిలారు. ఇటీవల అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన జో బైడెన్‌ జనవరి 20వ తేదీన ప్రమాణస్వీకారం చేయనున్న విషయం తెలిసిందే. 

ఇదీ చదవండి

భారత్‌లో టీకా పంపిణీ.. ప్రపంచానికి పాఠాలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని