Apurva Chandra: వార్తాసంస్థలకు ఆదాయాన్ని పంచాలి.. బిగ్‌ టెక్‌ అగ్రిగేటర్లకు సూచన!

డిజిటల్‌ వార్తాసంస్థల కంటెంట్‌తో ఆదాయాన్ని ఆర్జించే బిగ్‌ టెక్‌ అగ్రిగేటర్లు.. అందులో సరైనా వాటాను సంబంధిత ప్రచురణకర్తలతో పంచుకోవాలని సమాచార ప్రసారశాఖ కార్యదర్శి అపూర్వచంద్ర ఆకాంక్షించారు. ‘డిజిటల్‌ న్యూస్‌ పబ్లిషర్స్‌ అసోసియేషన్‌’ కాంక్లేవ్‌ ప్రారంభ సెషన్‌ను ఉద్దేశించి ఈ మేరకు తన సందేశం పంపించారు.

Published : 22 Jan 2023 01:14 IST

దిల్లీ: డిజిటల్‌ వార్తాసంస్థల కంటెంట్‌(Digital News)ను ఉపయోగించి ఆదాయాన్ని ఆర్జించే బిగ్‌ టెక్‌ అగ్రిగేటర్లు.. అందులో న్యాయమైన భాగాన్ని సంబంధిత ప్రచురణకర్తలతో పంచుకోవాలని సమాచార ప్రసారశాఖ కార్యదర్శి అపూర్వచంద్ర(Apurva Chandra) సూచించారు. 17 మీడియా సంస్థల ‘డిజిటల్‌ న్యూస్‌ పబ్లిషర్స్‌ అసోసియేషన్‌(DNPA)’ కాంక్లేవ్‌ ప్రారంభ సెషన్‌ను ఉద్దేశించి ఆయన ఈ మేరకు తన సందేశం పంపించారు. ఆస్ట్రేలియా, కెనడా, ఫ్రాన్స్, యూరోపియన్ యూనియన్‌లు ఇప్పటికే తమ చట్టసభల ద్వారా ఈ విధమైన చర్యలు తీసుకున్నాయని గుర్తుచేశారు. వార్తల ద్వారా వచ్చే ఆదాయం.. వార్తాప్రచురణకర్తలు, అగ్రిగేటర్ల(Aggregators) మధ్య న్యాయంగా విభజన జరిగేలా అవి చొరవ చూపాయన్నారు.

‘కొవిడ్ తర్వాత.. డిజిటల్ వార్తా పరిశ్రమే కాకుండా, ప్రింట్ న్యూస్ వ్యవస్థ సైతం ఆర్థికంగా దెబ్బతింది. ఈ పరిశ్రమపై ప్రతికూల ప్రభావం కొనసాగితే.. ప్రజాస్వామ్యానికి నాల్గో స్తంభమైన ‘జర్నలిజం’ భవిష్యత్తు కూడా దెబ్బతింటుంది. దేశానికి సేవ చేసిన చరిత్ర ఈ పరిశ్రమకు ఉంది. ఈ నేపథ్యంలో వార్తాపరిశ్రమ వృద్ధికిగానూ.. డిజిటల్‌ న్యూస్‌ పబ్లిషర్‌ల కంటెంట్‌ ద్వారా బిగ్‌ టెక్‌ అగ్రిగేటర్లకు వచ్చే రాబడిలో.. సంబంధిత వార్తాసంస్థలు న్యాయమైన వాటా పొందడం చాలా ముఖ్యం’ అని అపూర్వ చంద్ర పేర్కొన్నారు. సరైన, వాస్తవమైన వార్తలు బయటకు వచ్చేలా నిర్ధరించుకునేందుకుగానూ స్థానిక వార్తాసంస్థలు సరైన వ్యవస్థలను కలిగి ఉన్నట్లు భావిస్తున్నానన్నారు. కేంద్ర ప్రభుత్వ ‘స్వీయ నియంత్రణ’ విధానానికి ఇవి మంచి ఉదాహరణలని తెలిపారు.

ఆస్ట్రేలియా ఎంపీ పాల్ ఫ్లెచర్ మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం ఆదాయ విభజనపై రూపొందించిన ముసాయిదాపై తొలుత గూగుల్‌, ఫేస్‌బుక్‌ల నుంచి తీవ్ర ప్రతిఘటన వచ్చినట్లు తెలిపారు. ‘ఆస్ట్రేలియాలో తమ సెర్చ్ సేవలను నిలిపేస్తామని గూగుల్ ఒక సమయంలో ప్రకటించింది.  అనంతరం గూగుల్‌ వెనక్కు తగ్గింది. ఫేస్‌బుక్‌ సైతం.. పోలీసు, అంబులెన్స్‌, రెడ్‌క్రాస్ వంటి కీలకమైన సేవల పేజీలను మూసివేసింది. కానీ, బలమైన రాజకీయ నాయకత్వంతో మేం వాటిని దీటుగా ఎదుర్కొన్నాం. చివరకు ఆ రెండు సంస్థలు దిగొచ్చాయి’ అని ఆయన వివరించారు. ఆస్ట్రేలియాలో బిగ్‌ టెక్‌ ప్లాట్‌ఫాంలు, వార్తా ప్రచురణకర్తల మధ్య ఆదాయ భాగస్వామ్యంలో సంస్కరణలపై చట్టాన్ని తీసుకురావడం వెనుక పాల్‌ ఫ్లెచర్‌ది కీలక పాత్ర.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని