Bill Gates: మహిళా ఉద్యోగికి ఈ-మెయిళ్లు.. బిల్‌గేట్స్‌ను ఆనాడే హెచ్చరించారట

మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు, దాతృత్వ కార్యక్రమాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ పొందిన బిల్‌ గేట్స్‌ 2020లో సంస్థ బోర్డు నుంచి వైదొలిగారు. 20 ఏళ్ల క్రితం సంస్థలోని

Updated : 19 Oct 2021 10:26 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు, దాతృత్వ కార్యక్రమాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ పొందిన బిల్‌ గేట్స్‌ 2020లో సంస్థ బోర్డు నుంచి వైదొలిగారు. 20 ఏళ్ల క్రితం సంస్థలోని ఓ మహిళా ఉద్యోగితో ఆయన నడిపిన లైంగిక సంబంధాలు బయటపడటంతో గేట్స్‌ బోర్డు నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అయితే దీని గురించి 2008లోనే బిల్‌గేట్స్‌ను కంపెనీ హెచ్చరించినట్లు తాజాగా వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ కథనం వెల్లడించింది. 

2007లో గేట్స్‌ మైక్రోసాఫ్ట్‌ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. ఆ సమయంలో ఓ మహిళా ఉద్యోగికి ఆయన అభ్యంతరకర ఈ-మెయిళ్లు పంపడమేగాక, తనను బయట వ్యక్తిగతంగా కలవాలని ఆమెను ఆహ్వానించారు. ఏడాది తర్వాత ఈ విషయం కంపెనీ బోర్డు దృష్టికి వెళ్లింది. ఇది తగిన ప్రవర్తన కాదని, ఇలాంటివి మానుకోవాలని మైక్రోసాఫ్ట్‌ ఎగ్జిక్యూటివ్‌ బోర్డు సభ్యుల బృందం గేట్స్‌ను హెచ్చరించింది. ఈ-మెయిళ్లు పంపిన విషయాన్ని గేట్స్‌ కూడా అంగీకరించారని, ఇంకెప్పుడూ ఇలాంటి పనులు చేయనని ఆయన బోర్డుకు తెలిపినట్లు వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ కథనం పేర్కొంది. దీంతో గేట్స్‌పై బోర్డు ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపింది. ఈ కథనం గురించి మైక్రోసాఫ్ట్‌ ప్రతినిధిని సంప్రదించగా.. అదంతా నిజమే అని ధ్రువీకరించినట్లు తెలిసింది. 

కాగా.. ఈ-మెయిళ్ల విషయం బయటకొచ్చిన కొద్ది రోజుల తర్వాతే బిల్‌ గేట్స్‌ మైక్రోసాఫ్ట్‌ అధ్యక్ష పదవి నుంచి దిగిపోయారు. అయితే బోర్డు సభ్యుడిగా కొనసాగిన ఆయన 2020 మార్చిలో అక్కడి నుంచి కూడా వైదొలిగారు. బిల్‌ అండ్‌ మెలిందా గేట్స్ ఫౌండేషన్‌’ నిర్వహించే ధార్మిక కార్యక్రమాలపై మరింత దృష్టి సారించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని బిల్‌ అప్పట్లో ప్రకటించారు. అయితే అది నిజం కాదని ఆ తర్వాత తెలిసింది. మహిళా ఉద్యోగితో గేట్స్‌ లైంగిక సంబంధాల వ్యవహరంపై కంపెనీ బోర్డు ఓ బయటి న్యాయ సంస్థతో విచారణ చేయించింది. ఈ క్రమంలోనే  ఆయన బోర్డు నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించడంతో విచారణ ఎటూ తేలకుండానే ముగిసినట్లు అప్పట్లో కొన్ని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. 

ఇదిలా ఉండగా.. దాదాపు మూడు దశాబ్దాల వివాహ బంధానికి స్వస్తి పలుకుతున్నట్లు ఈ ఏడాది ఆరంభంలో బిల్‌గేట్స్‌ - మిలిందా దంపతులు సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. మైక్రోసాఫ్ట్‌ అధినేతలుగానే కాకుండా పలు ధార్మిక కార్యక్రమాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ చూరగొన్న ఈ జంట విడిపోవడం యావత్‌ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. విడిపోవడానికి దారితీసిన కారణాలను ఈ జంట  చెప్పనప్పటికీ.. లైంగిక వేధింపుల కేసులో నేరస్థుడైన జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో గేట్స్‌ సంబంధాలు నచ్చని మెలిందా ఆయన నుంచి విడాకులు తీసుకునేందుకు సిద్ధమైనట్లు ప్రముఖ పత్రిక వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ ఆ మధ్య ఓ కథనంలో పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని