Corona: నిందిస్తూ కూర్చొంటే కరోనాను తరిమికొట్టలేం: కేజ్రీవాల్‌ కౌంటర్‌

దేశ రాజధాని ప్రాంతంలో కరోనా కేసులు పెరుగదలపై హరియాణా ఆరోగ్యశాఖ మంత్రి అనిల్‌ విజ్‌ చేసిన వ్యాఖ్యలను దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ .......

Published : 17 Jan 2022 16:55 IST

దిల్లీ: దేశ రాజధాని ప్రాంతంలో కరోనా కేసులు పెరుగుదలపై హరియాణా ఆరోగ్యశాఖ మంత్రి అనిల్‌ విజ్‌ చేసిన వ్యాఖ్యలను దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ గట్టిగా తిప్పికొట్టారు. పరస్పరం నిందారోపణలు చేస్తూ కూర్చొంటే కరోనా మహమ్మారిని నిర్మూలించలేమన్నారు. ఈ రక్కసిని దేశం నుంచి పూర్తిగా తరిమికొట్టాల్సి ఉందన్నారు. దిల్లీలో కొవిడ్‌ కేసులు ఉద్ధృతి ప్రభావం జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్‌సీఆర్‌)లో చూపిస్తోందనీ.. అందుకే గురుగ్రామ్, ఫరీదాబాద్‌, సోనిపట్‌ జిల్లాల్లో ఇన్ఫెక్షన్‌ రేటు పెరుగుతున్నట్టు అనిల్‌ విజ్‌ ఆరోపించారు. అయితే, సోమవారం దిల్లీలో తొలి ఎలక్ట్రిక్‌ బస్సు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కేజ్రీవాల్‌ మీడియాతో మాట్లాడారు. అనిల్‌ విజ్‌ చేసిన ఆరోపణలకు కౌంటర్‌ ఇచ్చారు. తాను నిందలు మోపబోననీ.. అలా నిందించుకోవడం వల్ల కరోనా మహమ్మారి నివారణ సాధ్యం కాదని చెప్పారు. దేశంలో కరోనా ఎక్కడ ఉన్నా నిర్మూలించాల్సిందేనన్నారు. దిల్లీలో కొవిడ్‌ కేసుల సంఖ్య తగ్గుతోందన్న ముఖ్యమంత్రి.. ఈరోజు 12 నుంచి 13వేల మధ్య కొత్త కేసులు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. ఆదివారం దిల్లీలో 18వేలకు పైగా కేసులు నమోదైన విషయం తెలిసిందే.

మరోవైపు, దిల్లీ రవాణా సంస్థ (డీటీసీ) తొలి ఎలక్ట్రిక్‌ బస్సును కేజ్రీవాల్‌ ప్రారంభించారు. ఏప్రిల్‌ నాటికి దిల్లీలో 300 ఎలక్ట్రిక్‌ బస్సులు వస్తాయన్నారు. మరికొన్ని సంవత్సరాల్లో దిల్లీ ప్రజా రవాణాలో దాదాపు 2వేల బస్సులు వచ్చి చేరతాయని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని