Published : 03/12/2021 01:26 IST

Global Gateway: ఐరోపా నుంచి చైనాకు సవాల్‌.. !

* 300 బిలియన్‌ డాలర్లతో బృహత్‌ ప్రణాళిక..

* తైవాన్‌తో అంటకాగుతున్న లిథువేనియా

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

ఐరోపా సమాఖ్య మెల్లగా చైనాకు దూరంగా జరుగుతోంది. లిథువేనియా వంటి చిన్న దేశం కూడా చైనా బెదిరింపులకు లొంగకుండా ఎదురు తిరగడం.. ఈయూ తాజాగా 300 బిలియన్ల డాలర్లతో గ్లోబల్‌ గేట్‌వే ప్రాజెక్టును ప్రకటించడం వంటి పరిణామాలు ఇదే విషయాన్ని వెల్లడిస్తున్నాయి. ఇక ఐరోపా సంఘంతో వాణిజ్య ఒప్పందం చర్చలు ఏ మాత్రం ముందుకు సాగకపోవడం వంటి పరిణామాలు డ్రాగన్‌ను కలవరపెట్టేట్లు ఉన్నాయి.

బెల్ట్‌ అండ్‌ రోడ్‌ వ్యూహంతో ప్రపంచ దేశాలను రుణ ఉచ్చులోకి లాగుతున్న చైనాకు తొలిసారి ఐరోపా నుంచి పెద్ద సవాల్‌ ఎదురైంది. ‘గ్లోబల్‌ గేట్‌వే’ పేరిట 300 బిలియన్‌ డాలర్లతో ప్రపంచ వ్యాప్తంగా పలు ప్రాజెక్టులు చేపట్టనున్నట్లు ఐరోపా సమాఖ్య నిన్న ప్రకటించింది. చైనా చేపట్టిన బీఆర్‌ఐ వలే ఈ కొత్త ప్రాజెక్టులో చీకటి ఒప్పందాలు ఉండవు. పూర్తి పారదర్శకంగా దీనిని చేపట్టనున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వ ప్రైవేటు రంగాలు సమష్టిగా ఈ ప్రాజెక్టును చేపట్టనున్నాయి. ముఖ్యంగా రైలు, రోడ్డు, పోర్టుల నిర్మాణాలు, ఫైబర్‌ ఆప్టికల్‌ కేబుళ్లు, ఎనర్జీ నెట్‌వర్క్‌ల ఏర్పాటు వంటివి చేపట్టి.. చిన్న దేశాలు రుణ ఉచ్చులో చిక్కుకోకుండా చూడటమే దీని లక్ష్యం. తొలుత ప్రాజెక్టు సమాచారం అక్టోబర్‌లో బయటకు వచ్చినప్పుడు ఐరోపాలో చైనా రాయబారి ఝాంగ్‌ మింగ్‌ స్పందిస్తూ ఈ కార్యక్రమాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పారు. కానీ, దీనిని పరపతి పెంచుకొనేందుకు సాధనంగా వాడుకొంటే విఫలం అవ్వడం ఖాయమని ఆయన హెచ్చరించారు. ఈ ప్రాజెక్టు చైనా బీఆర్‌ఐకి పోటీ అని ఐరోపా సమాఖ్య ఎక్కడా పేర్కొనలేదు. కానీ, తాజాగా ప్రాజెక్ట్‌ పత్రాలను బహిర్గతం చేశాక ‘బీఆర్‌ఐతో పెట్టుకొంటే ఐరోపాకు చెందిన 300 బిలియన్‌ డాలర్లు మునిగిపోవడం ఖాయం’ అంటూ గ్లోబల్‌ టైమ్స్‌ కథనం వెలువరించింది.

డ్రాగన్‌కు ఎదిరించిన లిథువేనియా..

ఐరోపా సమాఖ్యలోని చిన్న దేశమైన లుథువేనియా చైనాకు ఎదురొడ్డి నిలిచింది. 2012లో చైనా ఏర్పాటు చేసిన 17+1 సంఘం(సీఈఈసీ) నుంచి ఈ ఏడాది బయటకు వచ్చేసింది.  అంతేకాదు తైవాన్‌లో ప్రతినిధుల కార్యాలయాన్ని తెరుస్తామని మార్చిలో ప్రకటించడంతో చైనా మండిపడింది. దీంతో లిథువేనియాతో దౌత్య సంబంధాల స్థాయిని తగ్గించుకొంది. ఇటీవల తైవాన్‌ ప్రతినిధుల కార్యాలయం తెరిచేందుకు  ఆ దేశం అంగీకరించింది. నవంబర్‌ 18వ తేదీన ఈ కార్యాలయం లిథువేనియా రాజధాని విల్నియస్‌లో తెరుచుకొంది. ‘తైపీ’ కాకుండా ‘తైవాన్‌’ ప్రతినిధుల పేరిట ఈ కార్యాలయం ఏర్పాటైంది.  నవంబర్‌ 29న ఆ దేశ ప్రతినిధులు తైవాన్‌లో జరిగిన ఓపెన్‌ పార్లమెంట్‌ ఫోరంలో పాల్గొనడం కూడా డ్రాగన్‌కు కంటగింపుగా మారింది. ఈ చిన్నదేశం వెనుక అమెరికా ఉండి కథనడిపిస్తోందని చైనా అనుమానిస్తోంది. ఇది చిన్నదేశమే అయినా.. ఐరోపా సమాఖ్య, నాటో కూటముల్లో సభ్యదేశం కావడంతో చైనా దూకుడుగా ఏమీ చేయలేకపోతోంది. నాటోకు చెందిన కీలకమైన సైబర్‌ సెక్యూరిటీ కేంద్రాలు ఇక్కడ ఉన్నాయి. 

మరోపక్క  డిసెంబర్‌లో 9-10 మధ్యలో  జరగనున్న ప్రజాస్వామ్య దేశాల సదస్సుకు తైవాన్‌ను బైడెన్‌ ఆహ్వానించారు. చైనాకు ఎటువంటి ఆహ్వానం అందలేదు. ‘‘తైవాన్‌ను వాడుకోవాలనుకోవడం నిప్పుతో చెలగాటమే’’ అంటూ షీజిన్‌పింగ్‌ అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ను హెచ్చరించిన కొన్ని రోజుల్లోనే తైవాన్‌కు ఆహ్వానం అందడం విశేషం.

నిలిచిపోయిన సమగ్ర పెట్టుబడుల ఒప్పందం..

చైనా-ఐరోపా సమాఖ్య మధ్య కుదిరిన సమగ్ర పెట్టుబడుల ఒప్పందం (సీఏఐ) నిలిచిపోయింది. ఈ పరిణామాలు చైనాకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. ఈ ఒప్పందం కోసం ఇరుపక్షాలు 2013 నుంచి ఏడేళ్లపాటు 35 విడతలకు పైగా చర్చలు జరిపాయి. బైడెన్‌ శ్వేతసౌధంలోకి అడుగుపెడితే ఇది ప్రమాదంలో పడుతుందని గ్రహించిన చైనా అధ్యక్షుడు షీజిన్‌పింగ్‌ రంగంలోకి దిగారు. ఐరోపా సమాఖ్యకు తాయిలాలు ఇచ్చి ఒప్పందంపై చర్చలను కొలిక్కి తెచ్చారు. ఈ ఒప్పందంవల్ల వాహన, రసాయన, వైద్య, ఆర్థిక సేవల రంగాల్లోని కంపెనీలకు చైనా మార్కెట్లో లబ్ధి చేకూరుతుంది. కానీ, ఈ ఒప్పందాన్ని ఐరోపా సమాఖ్య పార్లమెంట్‌ ఆమోదించే సమయంలో చైనాతో ఇబ్బందులు తలెత్తాయి. దీంతో ఈ ఒప్పందాన్ని ఐరోపా సమాఖ్య పక్కనపెట్టింది. జరుగుతున్న పరిణామాలు ఐరోపా సమాఖ్య, చైనాల మధ్య భవిష్యత్తులో కఠిన సవాళ్లు ఎదురుకానున్నాయన్న విషయాన్ని వెల్లడిస్తున్నాయి.

Read latest National - International News and Telugu News


Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని