దేశంలోనే భారీ రుణ మోసం.. ABG షిప్‌యార్డు ఛైర్మన్‌పై లుక్‌అవుట్‌ నోటీసులు

ఈ వ్యవహారంపై ఇప్పటికే కేసు నమోదు చేసిన సీబీఐ అధికారులు.. నిందితులు దేశం విడిచి ఎక్కడికీ పారిపోకుండా మంగళవారం లుక్‌ అవుట్‌ నోటీసులు జారీచేసినట్టు వెల్లడించారు....

Updated : 10 Aug 2022 11:38 IST

దిల్లీ: గుజరాత్‌కు చెందిన ఏబీజీ షిప్‌యార్డు సంస్థ 28 బ్యాంకులకు రూ.22,842 కోట్ల మేర మోసగించిన వ్యవహారం దేశంలో కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో ఆ సంస్థ ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ రిషి కమలేశ్‌ అగర్వాల్‌తో పాటు మరో ఎనిమిది మందికి సీబీఐ లుక్‌ అవుట్‌ నోటీసులు జారీ చేసింది. దేశంలోనే భారీగా బ్యాంకులకు రుణాల ఎగవేత మోసంపై ఇప్పటికే కేసు నమోదు చేసిన సీబీఐ అధికారులు.. నిందితులు దేశం విడిచి ఎక్కడికీ పారిపోకుండా మంగళవారం లుక్‌ అవుట్‌ నోటీసులు జారీచేసినట్టు వెల్లడించారు. ఈ మేరకు దేశంలోని విమానాశ్రయాలు, సరిహద్దు క్రాసింగ్‌ల వద్ద యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. 

మరోవైపు, ఎస్‌బీఐతో పాటు ఐసీఐసీఐ, ఐడీబీఐ వంటి బ్యాంకులకు రుణాల ఎగవేత ఆరోపణలపై నమోదైన కేసులో కంపెనీ డైరెక్టర్లు రిషి అగర్వాల్‌, ముత్తుస్వామి, అశ్వినీ కుమార్‌లపై సీబీఐ కేసు నమోదు చేసింది. బ్యాంకుల నుంచి కంపెనీ యాజమాన్యం రుణాలు తీసుకుని నిధులను మళ్లించడం, నిధుల దుర్వినియోగం వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది. ఏబీజీ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌ సంస్థ నౌకల తయారీ, మరమ్మతులు వంటి కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఈ కంపెనీకి గుజరాత్‌లోని సూరత్, దహేజ్‌లలో యార్డులు ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని