Omicron XE: ముంబయిలో తొలి ‘ఎక్స్‌ఈ’ కేసు.. కేంద్రం ఏమందంటే..?

దేశంలో కొవిడ్‌ కొత్త ‘ఎక్స్‌ఈ’ వేరియంట్‌ తొలి కేసు ముంబయిలో బయటపడినట్లు వస్తోన్న వార్తలను కేంద్ర ఆరోగ్యశాఖ ఖండించింది. ప్రస్తుతమున్న ఆధారాలతో

Updated : 07 Apr 2022 12:55 IST

ముంబయి: దేశంలో కొవిడ్‌ కొత్త ‘ఎక్స్‌ఈ’ వేరియంట్‌ తొలి కేసు ముంబయిలో బయటపడినట్లు వస్తోన్న వార్తలను కేంద్ర ఆరోగ్యశాఖ ఖండించింది. ప్రస్తుతమున్న ఆధారాలతో కొత్త వేరియంట్‌ను ధ్రువీకరించలేమని ఆరోగ్య శాఖ చెప్పినట్లు పీఐబీ మహారాష్ట్ర ట్విటర్‌ వేదికగా వెల్లడించింది.

‘‘ముంబయిలో ఓ మహిళకు ఎక్స్‌ఈ వేరియంట్ సోకినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ప్రస్తుతమున్న ఆధారాలు ఈ వేరియంట్‌ను సూచించట్లేదు. ఎక్స్‌ఈ వేరియంట్‌ సోకినట్లు భావిస్తోన్న మహిళ నమూనాలను ఇన్సాకాగ్‌కు చెందిన జీనోమిక్‌ నిపుణులు విశ్లేషిస్తున్నారు. మహిళ నమూనాల్లో ఉన్న మ్యుటెంట్‌ జెనెటిక్‌ మేకప్‌.. ఎక్స్‌ఈ మ్యుటెంట్‌తో సరిపోలడం లేదని వారు తెలిపారు. సదరు మహిళ రెండు డోసుల వ్యాక్సిన్‌ తీసుకున్నారు. అంతేగాక, ఆమెకు ఎలాంటి లక్షణాలు లేవు. ఫిబ్రవరి 10న ఆమె దక్షిణాఫ్రికా నుంచి భారత్‌కు వచ్చారు. అంతకుముందు ఆమె విదేశీ ప్రయాణాలు చేయలేదు. భారత్‌కు వచ్చినప్పుడు ఆమెకు పరీక్షల్లో నెగెటివ్‌ వచ్చింది’’ అని కేంద్ర హోంశాఖ వెల్లడించినట్లు పీఐబీ మహారాష్ట్ర తెలిపింది.

కంగారు పడొద్దు..

ఈ వార్తలపై మహరాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రాజేశ్ తోపే స్పందించారు. అది ఎక్స్‌ఈ వేరియంటే అని ఇప్పుడే స్పష్టంగా చెప్పలేమన్నారు. ప్రజలెవరూ కంగారుపడొద్దని తెలిపారు. ‘‘ఎక్స్‌ఈ వేరియంట్‌ సోకినట్లుగా భావిస్తోన్న మహిళ డేటా, నమూనాలను తదుపరి విశ్లేషణలకు పంపించాం. అది ఎక్స్‌ఈ వేరియంటే అని ధ్రువీకరించేలా అటు కేంద్రం నుంచి గానీ.. ఇటు నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బయోలాజికల్స్‌ నుంచి గానీ ఎలాంటి నివేదిక రాలేదు. అందువల్ల ముంబయిలోకి కొత్త వేరియంట్‌ ప్రవేశించిందని ఇప్పుడే స్పష్టంగా చెప్పలేం. ఆ రిపోర్టులు వచ్చిన తర్వాతే దీని గురించి పూర్తి వివరాలను వెల్లడిస్తాం. ఇప్పటివరకు వెలువడిన అధ్యయనాల ప్రకారం.. ఎక్స్‌ఈ వేరియంట్.. ఒమిక్రాన్‌ కంటే 10శాతం వేగంగా వ్యాప్తి చెందుతుంది. అయితే ప్రజలు కంగారు పడాల్సిన అవసరం లేదు. మళ్లీ ఆంక్షలను విధించే ఆలోచన లేదు’’ అని రాజేశ్ తోపే వెల్లడించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని