Chidambaram: ‘కాస్త మేల్కొని కాఫీ వాసన చూడండి’.. కేంద్రంపై చిదంబరం విమర్శలు..!

దేశంలో ధరల పెరుగుదలకు కేంద్రం కేవలం అంతర్జాతీయ పరిణామాలను మాత్రమే కారణంగా చూపడం సరికాదని కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం అన్నారు.

Published : 08 Oct 2022 01:47 IST

దిల్లీ: దేశంలో ధరల పెరుగుదలకు కేంద్రం కేవలం అంతర్జాతీయ పరిణామాలను మాత్రమే కారణంగా చూపడం సరికాదని కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం అన్నారు. ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకపోతే.. భారత వృద్ధి అంచనాలు మరింత దిగజారతాయని హెచ్చరించారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితి గురించి సంతోషంగా ఉన్నది ఒక్క కేంద్రం మాత్రమేనని విరుచుకుపడ్డారు. కాస్త మేల్కొని, కాఫీ వాసన చూడాలని ఎద్దేవా చేశారు. 

‘రూపాయి పతనం, జీడీపీ వృద్ధి మందగమనం, ద్రవ్యోల్బణం.. వీటికి ఉక్రెయిన్ సంక్షోభం కారణమని ప్రభుత్వం చెప్తోంది. ఈ కారణాలు చెప్పి ప్రభుత్వం చేతులు ఎత్తేస్తుందా..? మీరెందుకు ప్రభుత్వంలో ఉన్నారు..? మీరు అంతర్జాతీయ పరిణామాలతో పాటు, అంతర్గత సమస్యలను పరిష్కరించాలి’ అని వ్యాఖ్యానించారు. అలాగే ఇటీవల కాలంలో రూపాయి భారీగా పతనం అవుతోంది. దీనిపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ..  ఇతర దేశాల కరెన్సీతో పోలిస్తే అమెరికా డాలరుతో రూపాయి బాగానే రాణిస్తోందని బదులిచ్చారు. ఈ తీరును తాజాగా చిదంబరం తప్పుపట్టారు. ఈ రకమైన పోలిక తేవడాన్ని ప్రశ్నించారు. ‘ఎన్నో విషయాల్లో మనం బలహీనంగా ఉన్నాం. ఉదాహరణకు పేదరికం, మేటర్నల్ ఇన్‌ఫాంట్ మోర్టాలిటీ రేటునే చూసుకుందాం’ అని దుయ్యబట్టారు. యూపీఏ పాలన(2012, 2013 సమయం)లో కూడా రూపాయి వేగంగా పతనమైందన్నారు. కానీ, అప్పటి తమ ప్రభుత్వం పతనానికి అడ్డుకట్ట వేసే తగిన చర్యలు తీసుకుందన్నారు. 

ఇంధన ధరలే  ద్రవ్యోల్బణానికి కారణమన్నారు. ముందు ఇంధన ధరలను తగ్గించాలన్నారు. ద్రవ్యోల్బణ కట్టడికి ముందుగా ప్రభుత్వం మేల్కొనాలని ఎద్దేవా చేశారు. ‘ప్రభుత్వం నిద్రపోతోంది. అది మేల్కొనాల్సి ఉంది. కళ్లు తెరిచి, కాఫీ వాసన చూడాలి. ప్రతి త్రైమాసికానికి వృద్ధి రేటు పడిపోతోంది’ అని మండిపడ్డారు. అలాగే భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించి చేపట్టాల్సిన చర్యలను సూచించారు. పెట్టుబడులను ఆకర్షించాలని, కరెంటు ఖాతా లోటును కట్టడి చేయాలని చెప్పారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని