xi jinping: చరిత్రాత్మకం.. చైనా తీర్మానం జిన్‌పింగ్‌కు రాచబాట

మూడోసారి చైనా అధ్యక్షుడిగా జిన్‌పింగ్‌ పగ్గాలు చేపట్టడానికి పాలక కమ్యూనిస్టు పార్టీ రంగం సిద్ధం చేసింది.

Updated : 12 Nov 2021 17:12 IST

మూడోసారి పగ్గాలు చేపట్టేందుకు రంగం సిద్ధం

బీజింగ్‌: మూడోసారి చైనా అధ్యక్షుడిగా జిన్‌పింగ్‌ పగ్గాలు చేపట్టడానికి పాలక కమ్యూనిస్టు పార్టీ రంగం సిద్ధం చేసింది. జిన్‌పింగ్‌కు ముందు అధ్యక్ష పదవి నిర్వహించిన హూ జింటావో రెండు పదవీ కాలాలు ముగిశాక అధికారం నుంచి తప్పుకొన్నారు. దేశాధ్యక్ష పదవిలో ఎవరూ రెండుసార్లకు మించి కొనసాగకూడదని గతంలో డెంగ్‌ జియావో పింగ్‌ హయాంలో పరిమితి విధించారు. అయితే 2018లో రాజ్యాంగ సవరణ ద్వారా ఈ పరిమితిని రద్దు చేయడంతో జిన్‌పింగ్‌ మూడోసారే కాకుండా జీవితకాల అధ్యక్షుడిగా కొనసాగడానికి మార్గం సుగమం అయింది. బీజింగ్‌లో ఈ నెల 8 నుంచి 11 వరకు నిర్వహించిన పార్టీ కేంద్ర కమిటీ ఆరో ప్లీనరీ సమావేశం గత వందేళ్లలో కమ్యూనిస్టు పార్టీ సాధించిన విజయాలను ఏకరవు పెడుతూ ‘చరిత్రాత్మక తీర్మానం’ చేసింది. రానున్న దశాబ్దాల్లో చైనా కమ్యూనిస్టు పార్టీ దశ, దిశలను ఈ తీర్మానం నిర్దేశిస్తుంది. చైనా కమ్యూనిస్టు పార్టీ చరిత్రలో ఇంతవరకు రెండేసార్లు ఇలాంటి చరిత్రాత్మక తీర్మానాలు చేసింది. 1945లో మావో సారథ్యంలో సాంస్కృతిక విప్లవం తీసుకు రావడానికి.. 1981లో డెంగ్‌ సియావో పింగ్‌ ఆర్థిక సంస్కరణలను చేపట్టడానికి ఆ తీర్మానాలు చేశారు. ఇలాంటి వాటిలో తాజా తీర్మానం మూడోది. జిన్‌పింగ్‌ చైనాలో మూడు అధికార కేంద్రాలైన కమ్యూనిస్టు పార్టీ, కేంద్ర మిలటరీ కమిషన్, దేశాధ్యక్ష పదవులను ఒంటి చేత్తో నిర్వహిస్తున్నారు. అందువల్ల ఆయన్ను కమ్యూనిస్టు పార్టీ వ్యవస్థాపకుడు మావో జెడాంగ్‌ తర్వాత అంతటి ‘కీలక నాయకుడి’గా గుర్తింపు పొందింది జిన్‌పింగే. 2016లో ఆయనకు ఈ హోదా కట్టబెట్టి.. పార్టీ నిబంధనావళిలో పొందుపరిచారు. ప్లీనరీ సమావేశంలో పార్టీ పొలిట్‌బ్యూరో 
తరఫున జిన్‌పింగ్‌ ముఖ్య ప్రసంగం చేశారు. అందులో పార్టీ, ప్రభుత్వం సాధించిన విజయాలను వివరించారు. 2022 ద్వితీయార్ధంలో బీజింగ్‌లో కమ్యూనిస్టు పార్టీ 20వ జాతీయ మహాసభల నిర్వహణకు ప్లీనరీ సమావేశం తీర్మానం చేసింది. ఆ మహాసభల్లో జిన్‌పింగ్‌ను మూడోసారి అధ్యక్షుడిగా ఎన్నుకుంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఆసియా-పసిఫిక్‌లో ప్రచ్ఛన్నయుద్ధం వద్దు! అలనాటి పరిస్థితులు పునరావృతం కానివ్వరాదు : జిన్‌పింగ్‌ 
వెల్లింగ్టన్‌: ఆసియా-పసిఫిక్‌ ప్రాంతంలో ఉద్రిక్తతలతో ప్రచ్ఛన్నయుద్ధం నాటి పరిస్థితులు పునరావృతం కాకుండా చూడాలని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ స్పష్టంచేశారు. ఇక్కడ కూటముల వారీగా విడిపోవడం తగదన్నారు. గురువారం ఆయన ఆసియా-పసిఫిక్‌ ఆర్థిక సహకార మండలి (అపెక్‌) శిఖరాగ్ర సదస్సుకు ఒక వీడియో సందేశాన్ని పంపారు. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియాలు కొత్తగా కూటమి ఏర్పాటు చేయడం, అస్ట్రేలియాకు అణు జలాంతర్గాములు సమకూర్చేందుకు సిద్ధపడటం వంటి అంశాల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కూటమిపై చైనా తీవ్ర ఆగ్రహంగా ఉంది.  అపెక్‌ శిఖరాగ్ర సదస్సు వర్చువల్‌గా న్యూజిలాండ్‌లో జరుగుతోంది. ఇందులో భాగంగా గురువారం సీఈవో సదస్సు జరిగింది. దీనికి జిన్‌పింగ్‌ ఒక వీడియో సందేశాన్ని పంపారు. ఆసియా-పసిఫిక్‌ ప్రాంతంలో మతం, సిద్ధాంతం, భౌగోళిక రాజకీయ సూత్రాల ఆధారంగా చీలికలు తీసుకురావడానికి జరిగే ప్రయత్నాలు విఫలం కాక తప్పదన్నారు. ఈ ప్రాంతంలో సరకు సరఫరా వ్యవస్థలు సజావుగా సాగాలన్నారు. అలాగే వాణిజ్యం, పెట్టుబడుల సరళీకరణను కొనసాగించాలని కోరారు. తాము అదే మార్గంలో పయనిస్తామన్నారు. మరోవైపు అపెక్‌ కూటమిలో విభేదాలు ప్రస్ఫుటమయ్యాయి. 2023లో ఈ శిఖరాగ్ర సదస్సుకు ఆతిథ్యమిస్తామంటూ అమెరికా చేసిన ప్రతిపాదనపై ఏకాభిప్రాయం రాలేదు. తన డిమాండ్లు పరిష్కారం కాలేదంటూ రష్యా దీన్ని వ్యతిరేకించడమే ఇందుకు కారణం. తమ దౌత్యాధికారులను అమెరికా ‘బ్లాక్‌ లిస్ట్‌’ నుంచి తొలగించాలని లేదా అపెక్‌ సమావేశాల కోసం ఆ దేశం వెళ్లేందుకు అనుమతించాలని రష్యా డిమాండ్‌ చేస్తోంది. దీనికి అమెరికా సమ్మతించే అవకాశం లేదన్న వాదన వినిపిస్తోంది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని