సైబర్‌ నేరాల కట్టడికి పౌరుల సేవలు

సైబర్‌ ప్రపంచంపై మరింత సమన్వయంతో, సమగ్ర రీతిలో కన్నేసి ఉంచేందుకు సామాన్య ప్రజలు ‘సైబర్‌ క్రైమ్‌ వాలంటీర్లు’గా నమోదు కావాలని కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది.

Published : 10 Feb 2021 15:27 IST

వాలంటీర్లుగా నమోదుకు కేంద్రం పిలుపు

దిల్లీ, జమ్ము: సైబర్‌ ప్రపంచంపై మరింత సమన్వయంతో, సమగ్ర రీతిలో కన్నేసి ఉంచేందుకు సామాన్య ప్రజలు ‘సైబర్‌ క్రైమ్‌ వాలంటీర్లు’గా నమోదు కావాలని కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది. తద్వారా దేశ సార్వభౌమాధికారానికి వ్యతిరేకంగా, చిన్నారులు, మహిళలను కించపరిచేలా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే పోస్టులను అడ్డుకోవడంలో సాయపడాలని కోరింది. ఈ మేరకు ‘ఇండియన్‌ సైబర్‌ క్రైమ్‌ కోఆర్డినేషన్‌ సెంటర్‌’ (ఐ4సీ) అనే ప్రాజెక్టు కింద దీన్ని చేపడుతున్నారు. దీన్ని గతవారం జమ్మూ-కశ్మీర్‌లో ప్రారంభించారు. అక్కడ.. వాలంటీర్లుగా నమోదుకావాలని సూచిస్తూ పౌరులకు పోలీసులు ఒక సర్క్యులర్‌ జారీ చేశారు. 

భారత పౌరులెవరైనా వాలంటీరు ప్రాజెక్టులో పాలుపంచుకోవచ్చు. 

♦ చట్టవిరుద్ధ అంశాలను గుర్తించే సైబర్‌ వాలంటీరు, సైబర్‌ అవగాహన ప్రచారకుడు, సైబర్‌ నిపుణుడు అనే మూడు విభాగాల్లో ఏదో ఒక దానిలో నమోదు కావొచ్చు. 

 మొదటి విభాగంలోని వాలంటీర్లు.. అశ్లీల దృశ్యాల్లో చిన్నారులను వినియోగించడం, అత్యాచారం, సామూహిక అత్యాచారం, ఉగ్రవాదం, అతివాదం, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు సంబంధించిన అంశాలను గుర్తించడంలో సాయపడతారు. 

 రెండో విభాగంలోనివారు.. మహిళలు, చిన్నారులు, వయోవృద్ధులు, గ్రామీణులు వంటి వారిని సైబర్‌ నేరాల గురించి అప్రమత్తం చేస్తారు. 

♦ మూడో విభాగంలోని వాలంటీర్లు.. సైబర్‌ నేరాల్లోని నిర్దిష్ట విభాగాలు, ఫోరెన్సిక్స్, నెట్‌వర్క్‌ ఫోరెన్సిక్స్, మాల్‌వేర్‌ విశ్లేషణ, మెమరీ విశ్లేషణ, క్రిప్టోగ్రఫీ వంటి అంశాల్లో సేవలు అందిస్తారు. 

♦ మొదటి విభాగంలోని వారికి పూర్వాపరాల తనిఖీ ఉండదు. రెండు, మూడు విభాగాల వారికి మాత్రం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ‘కేవైసీ’ నిబంధనల ద్వారా పరిశీలన జరుపుతాయి. 

ఏకతాటిపైకి తెచ్చేందుకే..

సైబర్‌ నేరాల నివారణ, ముందే పసిగట్టడం, దర్యాప్తు, విచారణ వంటి అంశాల కోసం విద్యావేత్తలు, పరిశ్రమలు, ప్రభుత్వ, ప్రైవేటు వర్గాలతో ఒక వేదికను ఏర్పాటు చేయడమే ‘ఐ4సీ’ ఉద్దేశమని హోం మంత్రిత్వశాఖ తెలిపింది. ఇది పూర్తిగా స్వచ్ఛందమని, వాలంటీర్లకు ఎలాంటి పారితోషికం ఉండదని చెప్పింది. ఈ హోదాను వాణిజ్యపరమైన లబ్ధి కోసం కూడా ఉపయోగించకూడదని పేర్కొంది. ఈ ప్రాజెక్టులో తాము పాలుపంచుకుంటున్నట్లు వాలంటీర్లు ఎలాంటి బహిరంగ ప్రకటన చేయకూడదని స్పష్టం చేసింది. తమ విధులకు సంబంధించి పూర్తి గోప్యత పాటించాలంది. 

ఇవీ చదవండి..
‘అంతర్జాతీయ శక్తిగా భారత్‌ను స్వాగతిస్తున్నాం’

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని