ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని..నదిని దాటేశారు

తాము కోరుకున్న వ్యక్తిని పెళ్లి చేసుకుని ఇంటి వారైపోవాలనుకున్నారు ఓ జంట. అందమైన జీవితాన్ని ఊహించుకుంటూ కలల్లో తేలిపోయారు

Updated : 28 Oct 2020 19:36 IST

మనీలా: తాము కోరుకున్న వ్యక్తిని పెళ్లి చేసుకుని ఒక ఇంటివారైపోవాలనుకున్నారు ఓ జంట. అందమైన జీవితాన్ని ఊహించుకుంటూ కలల్లో తేలిపోయారు. వారు అనుకున్నట్టు జరిగితే అది లైఫ్ ఎందుకు అవుతుంది. అందుకే తుపాను రూపంలో వారికి ఆటంకం ఎదురైంది. వారు వెళ్లే దారిలో నది వరదతో ఉప్పొంగింది. ఇదంతా గమనించిన వారు ఏదిఏమైనప్పటికీ.. తమ కలలు నిజం చేసుకోవాలనే అనుకున్నారు. అందుకే  తుపానును లెక్కచేయకుండా, కాస్త రిస్క్‌ చేసి నదిని దాటేసి, పెళ్లి చేసేసుకున్నారు. ఇదంతా ఫిలిప్పైన్స్‌లో ఓ జంటకు ఎదురైన అనుభవం. వేడుకకు హాజరైన వారి స్నేహితుల్లో ఒకరు వధువు, వరుడు పెళ్లి దుస్తుల్లో నదిని దాటుతున్న చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయగా..అవి వైరల్‌గా మారాయి.  

అక్కడి స్థానిక పత్రిక వెల్లడించిన వివరాల ప్రకారం.. అక్టోబర్‌ 23న రోనిల్ గిల్లిపా, జెజీల్ మసేలా తుపాను వాతావరణంలో, వరదతో ఉప్పొంగుతున్న లుయాంగ్ నదిని దాటారని, అక్కడి నుంచి అతికష్టం మీద చర్చికి చేరుకొని వివాహ బంధంతో ఒక్కటయ్యారని తెలిపింది. కాగా, పెళ్లి కుమార్తె వరద నీటిలో తన పెళ్లి గౌను తడవకుండా భద్రంగా పట్టుకున్నట్లు మనకు ఆ ఫొటోల్లో కనిపిస్తుంది. ఆమె వెంటే పెళ్లి కుమారుడు దర్శనమిచ్చాడు. టైఫూన్ క్వింటా కారణంగా ఆ జంటకు ఈ పరిస్థితి ఎదురైంది. 

కాగా, వీరి సాహసం నెటిజన్లను మెప్పించింది. అవరోధాలు దాటుకొని వివాహంతో ఒక్కటైన వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. కాకపోతే చర్చిలో పెళ్లి పూర్తయిన తరవాత భారీ వర్షం కారణంగా వారు అక్కడే ఉండిపోవాల్సి వచ్చిందని వారి స్నేహితులు వెల్లడించారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని