Heavy Rains: 1000 ఏళ్లలో చూడనంత భారీ వర్షం.. చైనాకు నష్టమెంతంటే?

చైనాలో కురిసిన భారీ వర్షాలకు మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. సెంట్రల్‌ చైనాలోని హెనాన్‌ ప్రావిన్స్‌లో జల విలయానికి బలైనవారి సంఖ్య....

Updated : 23 Jul 2021 22:16 IST

బీజింగ్‌: చైనాలో కురిసిన భారీ వర్షాలకు మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. సెంట్రల్‌ చైనాలోని హెనాన్‌ ప్రావిన్స్‌లో వరదల విలయానికి బలైనవారి సంఖ్య 51కి చేరినట్టు చైనా మీడియా వెల్లడించింది. ఈ వరదల ధాటికి దాదాపు 10 బిలియన్‌ డాలర్ల నష్టం వాటిల్లినట్టు అంచనా వేస్తున్నట్టు తెలిపింది. గత వెయ్యేళ్లలో ఎన్నడూ లేనంతగా కురిసిన భారీ వర్షాలతో హెనాన్‌ ప్రావిన్స్‌ రాజధాని నగరం ఝెన్‌ఝౌ జలదిగ్బంధంలో చిక్కుకోగా.. ఈ వరదలు 30 లక్షల మందిపై ప్రభావం చూపాయి. దాదాపు 3.76 లక్షల మందిని సహాయక సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వర్షాలు తగ్గి సాధారణ పరిస్థితులు నెలకొనడంతో 8 వేల మంది సైనికులతో పాటు భారీ సంఖ్యలో మోహరించిన సిబ్బంది వరద నీటిలో చిక్కుకున్నవారిని రక్షించడంలో నిమగ్నమయ్యారు. 

ప్రజలకు నిత్యావసరాలు అందించేందుకు హెనాన్‌ ప్రావిన్స్‌లోని పలుచోట్ల డొనేషన్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. నీటిలో చిక్కుకున్న ఆస్పత్రుల్లోని రోగులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. భారీ వర్షాలతో హెనాన్‌ ప్రావిన్స్‌లోని వీధులన్నీ నదుల్లా పొంగిపొర్లడంతో మనుషులతో పాటు అనేక కార్లు కొట్టుకుపోయిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. వరదనీటిలో కొట్టుకుపోయిన వందలాది కార్లు నగరంలోని పలు చోట్ల పోగుగా ఏర్పడ్డాయి. అగ్నిమాపక సిబ్బంది కూడా సమీపంలోని పలు గ్రామాల్లో తిరుగుతూ అవసరమైన వారికి సహాయం అందిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని