Dera baba: భారీ భద్రత మధ్య జైలుకు డేరాబాబా తరలింపు!

ఇద్దరు సాధ్వీలపై అత్యాచారం కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న డేరా సచ్చా సౌధ అధినేత గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌ ఇటీవల బెయిల్‌పై విడుదలైన విషయం...

Published : 01 Mar 2022 02:04 IST

ఛండీగఢ్‌: ఇద్దరు సాధ్వీలపై అత్యాచారం కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న డేరా సచ్చా సౌధ అధినేత గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌ ఇటీవల బెయిల్‌పై విడుదలైన విషయం తెలిసిందే. అయితే, ఆయనకు మంజూరైన మూడు వారాల ప్రత్యేక సెలవు (furlough) ముగియడంతో పోలీసులు తిరిగి డేరాబాబాను ఈరోజు సునారియా జైలుకు తరలించారు. మహిళలపై అత్యాచారం కేసులో 2017 ఆగస్టులో పంచకులలోని సీబీఐ ప్రత్యేక కోర్టు ఆయన్ను దోషిగా తేల్చడంతో పాటు 20 ఏళ్ల జైలు శిక్ష విధించడంతో అప్పట్నుంచి రోహ్‌తక్‌లోని సునారియా జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. అయితే, గురుగ్రామ్‌లోని తన కుటుంబ సభ్యుల్ని కలిసేందుకు డేరాబాబా దాదాపు ఐదేళ్ల తర్వాత తొలిసారి ఫిబ్రవరి 7న తొలిసారి జైలు నుంచి బయటకు వచ్చారు. అయితే, ప్రత్యేక సెలవు ముగియడంతో గురుగ్రామ్‌ నుంచి భారీ పోలీసు బందోబస్తు మధ్య రోహ్‌తక్‌లోని సునారియా జైలుకు తరలించామని పోలీసు అధికారులు వెల్లడించారు.  డేరాబాబా ప్రాణాలకు ముప్పు పొంచి ఉండటంతో ప్రభుత్వం ఈ 21 రోజుల పాటు ఆయనకు జెడ్‌ ప్లస్‌ కేటగిరీ భద్రత కల్పించినట్టు అధికారులు పేర్కొన్నారు.

అయితే, పంజాబ్‌లో ఫిబ్రవరి 20న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో డేరా బాబా బయటకు రావడం చర్చనీయాంశంగా మారింది. ఆయనకు ప్రత్యేకించి పంజాబ్‌లోని భటిండా, సంగ్రూర్‌, పటియాలా, ముక్త్‌సర్‌లలో భారీగా అభిమానులు, అనుచరులు ఉన్నారు. అయితే, ఆయన విడుదలకు ఎన్నికలకు ఎలాంటి సంబంధంలేదని హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ అప్పట్లోనే కొట్టిపారేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని