Odisha train Tragedy: లోకో పైలట్‌ తప్పిదం లేదు..! ‘సిగ్నల్‌ వ్యవస్థ’ ట్యాంపరింగ్‌ జరిగిందా?

ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం (Odisha Train Accident)లో కోరమాండల్‌ లోకో పైలట్‌ తప్పిదం లేదని.. సిగ్నలింగ్‌ వ్యవస్థను ఎవరో మార్చడం వల్లే ఇది జరిగిందని రైల్వేశాఖ ఉన్నతాధికారులు (Indian Railways) పేర్కొన్నారు.

Updated : 04 Jun 2023 20:04 IST

దిల్లీ: ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం (Odisha Train Accident) పూర్తి కారణాలపై ఇంకా స్పష్టత రానప్పటికీ.. డ్రైవర్‌ తప్పిదం లేకపోవచ్చని రైల్వేశాఖ ఉన్నతాధికారులు (Indian Railways) పేర్కొన్నారు. ఘటన సమయంలో రెండు రైళ్లు కూడా పరిమిత వేగానికి లోబడే వెళ్తున్నాయన్నారు. ఎలక్ట్రానిక్‌ ఇంటర్‌లాకింగ్‌ వ్యవస్థ (Interlocking System) సరిగ్గానే ఉన్నప్పటికీ.. అందులో ఎవరో ట్యాంపరింగ్‌కు పాల్పడ్డారనే అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో విధ్వంసం కోణంలోనూ రైల్వే అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

ఒడిశా రైలు ప్రమాద ఘటనకు దారి తీసిన ప్రధాన కారణాన్ని కనుగొన్నామని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడించారు. ‘ఎలక్ట్రానిక్‌ ఇంటర్‌లాకింగ్‌, పాయింట్‌ మెషిన్‌’లో మార్పు వల్లే ప్రమాదం సంభవించిందని ప్రాథమికంగా అంచనాకు వచ్చినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ఎలక్ట్రానిక్‌ ఇంటర్‌లాకింగ్‌, పాయింట్‌ మెషిన్‌ల పనితీరు, ప్రమాదం ఎలా జరిగి ఉండవచ్చనే విషయాలను రైల్వే బోర్డు ప్రిన్సిపల్‌ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌ ఆఫ్‌ సిగ్నలింగ్‌ సందీప్‌ మథూర్‌, ఆపరేషన్స్‌ అండ్‌ బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ సభ్యులు జయ వర్మ సిన్హా వివరించారు. రైలు ప్రయాణించే డైరెక్షన్‌, రూటు, సిగ్నల్‌ళ్లను పాటిస్తూ కోరమాండల్‌ ప్రయాణించిందని అన్నారు.

కేబుళ్లను తవ్విందెవరు..?

‘రైలు వెళ్తున్న మార్గంలో అడ్డుంకులను తెలియజేసే ఇంటర్‌లాకింగ్‌ వ్యవస్థ ఎలక్ట్రానిక్‌, ఎలక్ట్రానిక్‌ రహితంగా ఉంటాయి. ఈ రెండు కూడా తప్పిదానికి అవకాశం లేనివి. మార్చడానికి వీలు కానివి. దీన్నే ఫెయిల్‌ సేఫ్‌ సిస్టమ్‌ అంటారు. అనుకోని సందర్భాల్లో ఈ వ్యవస్థ విఫలమైతే.. అన్ని సిగ్నళ్లు రెడ్‌గా మారి, రైళ్లన్నీ ఆగిపోతాయి. సిగ్నలింగ్‌ వ్యవస్థలో సమస్య కారణంగా ఇది జరిగిందని కేంద్ర మంత్రి చెప్పారు. అంటే దీనిలో మానవ ప్రమేయం ఉండవచ్చు. కేబుళ్లను చూడకుండా ఎవరో అక్కడ తవ్వి ఉండవచ్చు’ అని సభ్యురాలు జయవర్మ సిన్హా వివరించారు.

ఓవర్‌ స్పీడు ప్రసక్తే లేదు..

‘ప్రయాణ మార్గంలో గ్రీన్‌ సిగ్నల్‌ ఉందంటే దానర్థం.. ఆ లైన్‌ మొత్తం క్లీయర్‌గా ఉందని డ్రైవర్‌కు తెలుస్తుంది. దాంతో ఆయనకు ఉన్న గరిష్ఠ వేగంతో ముందుకు వెళ్తాడు. ఈ మార్గంలో గరిష్ఠ పరిమితి వేగం గంటకు 130 కి.మీ. ప్రమాద సమయంలో రైలు గంటకు 128 కి.మీ వేగంతో వెళ్తున్నట్లు నిర్ధారణ అయ్యింది. బెంగళూరు-హావ్‌డా రైలు కూడా గంటకు 126 కి.మీ వేగంతో వచ్చింది. ఈ రెండు రైళ్లు కూడా అధిక వేగంతో వెళ్లాయన్న ప్రశ్నే ఉత్పన్నం కాదు. సిగ్నలింగ్‌ వ్యవస్థలో సమస్యే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా తేలింది’ అని రైల్వే బోర్డు సభ్యురాలు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని