ఎర్రకోట వద్ద రైతన్న జెండా..!

ట్రాక్టర్‌ ర్యాలీ చేపట్టిన రైతులు చివరకు దిల్లీలోని ఎర్రకోటకు చేరుకున్నారు. అక్కడ జాతీయ జెండాలను ప్రదర్శిస్తూ వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన చేపట్టారు.

Updated : 26 Jan 2021 16:15 IST

దిల్లీ: దేశ రాజధానిలో రైతులు చేపట్టిన ట్రాక్టర్‌ ర్యాలీలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. పలుచోట్ల పోలీసులు, రైతులకు తీవ్ర ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. అయినప్పటికీ భద్రతా వలయాలను ఛేదించుకున్న రైతన్నలు చివరకు ట్రాక్టర్లతో ఎర్రకోటకు చేరుకున్నారు. అక్కడ జాతీయ జెండాలను ప్రదర్శిస్తూ వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన చేపట్టారు.

ర్యాలీలో భాగంగా నగరంలోకి అనుమతిలేని ప్రాంతాల్లోకి ట్రాక్టర్లు వెళ్లకుండా పోలీసులు బస్సులను అడ్డుగా ఉంచారు. దీంతో   దిల్లీ ట్రాన్స్‌పోర్ట్‌ బస్సును ధ్వంసం చేసిన ఆందోళన కారులు, మరిన్ని బస్సులను ట్రాక్టర్లతోనే పక్కకు తోసివేసి ముందుకు సాగారు. ఆందోళనకారులను ఇండియా గేట్‌, రాజ్‌పథ్‌, రాజ్‌ఘాట్‌ వైపు వెళ్లకుండా నిలువరించేందుకు భద్రతా దళాలు టియర్‌ గ్యాస్‌ ప్రయోగించాయి. అయినప్పటికీ రైతులు చివరకు ఎర్రకోటను చేరుకున్నారు.

రైతన్నలు చేస్తోన్న ర్యాలీ ఉద్రిక్తంగా మారడంతో దిల్లీలో ఐటీఓ ప్రాంతం యుద్ధవాతావరణాన్నే తలపించింది. ఓవైపు వేల సంఖ్యలో రైతుల ఆందోళన, మరోవైపు వారిని నిలువరించేందుకు పోలీసుల ప్రయత్నంతో ఆ ప్రాంతమంతా రణరంగంగా మారింది. ఇక అక్షరధామ్‌ ప్రాంతంలోనూ రైతులకు పోలీసులకు మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం ఏర్పడింది.

ఇదిలాఉంటే, సాయంత్రం ఐదు గంటల వరకూ రైతుల ర్యాలీకి అనుమతి ఉండడంతో పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు దిల్లీ పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

ఇవీ చదవండి..
ఉద్రిక్తతల నడుమ..కొనసాగుతోన్న ట్రాక్టర్‌ పరేడ్‌!
కిసాన్‌ పరేడ్‌: దిల్లీలోకి ప్రవేశించిన ట్రాక్టర్లు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని