Drone Pilot: డ్రోన్‌ పైలట్‌ ట్రెయినింగ్‌ కోర్సు.. త్వరలోనే తగ్గనున్న ఫీజు

దేశంలో ఇటీవల డ్రోన్ల వినియోగం భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. దీంతో డ్రోన్‌ పైలట్లకు శిక్షణ ఇచ్చేందుకు ఎన్నో శిక్షణా సంస్థలు ముందుకు వస్తున్నాయి.

Published : 18 May 2022 01:42 IST

పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా

దిల్లీ: దేశంలో ఇటీవల డ్రోన్ల వినియోగం భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. దీంతో డ్రోన్‌ పైలట్లకు శిక్షణ ఇచ్చేందుకు ఎన్నో శిక్షణా సంస్థలు ముందుకు వస్తున్నాయి. అయితే, డ్రోన్‌ పైలట్‌ ట్రెయినింగ్‌ కోర్సుకు ప్రస్తుతం ఫీజు ఎక్కువగా ఉండడం నిరుద్యోగ యువతకు కాస్త ఇబ్బందిగా మారింది. ఇదే విషయంపై స్పందించిన కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా.. వచ్చే మూడు, నాలుగు నెలల్లో వీటి ఫీజు తగ్గనున్నట్లు ప్రకటించారు.

డ్రోన్ల వినియోగం పెరిగిన నేపథ్యంలో రైతులతో పాటు ఇతర వర్గాల వారితో కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా వర్చువల్‌ పద్ధతిలో సంభాషించారు. ఈ సందర్భంగా డ్రోన్‌ పైలట్‌ ట్రెయినింగ్‌ కోర్సు ఫీజు అధికంగా ఉందంటూ ఓ రైతు కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. దీనికి సమాధానమిచ్చిన సింధియా.. ప్రస్తుతం వాటి ఫీజు అధికంగా ఉన్న మాట వాస్తవమేనన్నారు. అయితే, రానున్న రోజుల్లో శిక్షణ ఇచ్చే స్కూల్స్‌ పెరుగుతున్నా కొద్ది ఫీజు తగ్గుతుందన్నారు. అధికారుల ప్రమేయం లేకుండా డ్రోన్‌ శిక్షణా కేంద్రాలకు డీజీసీఏ అనుమతులు జారీ చేస్తోందన్న ఆయన.. మరో మూడు, నాలుగు నెలల్లోనే వీటి ఫీజు గణనీయంగా తగ్గుతుందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా సాంకేతిక విప్లవంలో డ్రోన్లు అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్నాయన్న ఆయన.. ఖర్చు, సమయం, వనరులను తగ్గించడంలో ఇవి ఎంతగానో దోహదపడుతున్నాయని చెప్పారు. సులభ వినియోగం దృష్ట్యా ఇదివరకున్న UAS నిబంధనల్లో భారీ మార్పులు చేశామన్నారు. 

ఇదిలాఉంటే, దేశంలో డ్రోన్ల వినియోగం పెరిగిన నేపథ్యంలో వాటిని దేశీయంగా తయారీ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇప్పటికే ‘అన్‌మ్యాన్‌డ్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ సిస్టం (UAS) నిబంధనలు-2021 ను కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది. గతేడాది మార్చి నుంచి అవి అమలులోకి వచ్చాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని