Afghanistan: పంజ్‌షిర్‌ ఒక్కటే కాదు మొత్తం అఫ్గాన్‌ కోసం పోరాడతాం!

అఫ్గానిస్థాన్‌లోని పంజ్‌షిర్‌ ప్రాంతాన్నే కాకుండా దేశం మొత్తాన్ని తాలిబన్ల పాలన నుంచి రక్షిస్తామని అహ్మద్‌ మసూద్‌

Published : 27 Aug 2021 01:47 IST

కాబుల్‌: అఫ్గానిస్థాన్‌లోని పంజ్‌షిర్‌ ప్రాంతాన్నే కాకుండా దేశం మొత్తాన్ని తాలిబన్ల పాలన నుంచి రక్షిస్తామని అహ్మద్‌ మసూద్‌ అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు. గతంలో తాలిబన్ల పాలనను ఎదుర్కోవడంలో పంజ్‌షిర్‌ ప్రాంతం కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. తాలిబన్ల వ్యతిరేక నాయకుడిగా ప్రసిద్ధిచెందిన అహ్మద్‌ షా మసూద్ కుమారుడు అహ్మద్‌ మసూద్‌, ఇప్పటి వరకు అఫ్గాన్ ఉపాధ్యక్షుడిగా ఉన్న అమ్రుల్లా సలేహ్‌ వంటి కీలక నేతలు తాలిబన్ల దురాక్రమణను సవాల్‌ చేస్తున్నారు. ఆ దిశగా వారు సన్నాహాలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే మసూద్‌ అధికార ప్రతినిధి ఫహీమ్‌  కీలక వ్యాఖ్యలు చేశారు.

‘ఇప్పటివరకు తాలిబన్లతో ఎలాంటి ఒప్పందం జరగలేదు. ఒకవేళ జరిగినా వారు కాబుల్‌ పరిపాలనలో భాగం మాత్రమే అవుతారు. మేము ఒక్క పంజ్‌షిర్‌ కోసం మాత్రమే పోరాడట్లేదు. దేశం మొత్తాన్ని రక్షించడానికి పోరాడుతున్నాం. అఫ్గాన్‌ ప్రజల హక్కులు, మహిళల భద్రత, మైనారిటీల రక్షణ కోసం మేమంతా ఆందోళన చెందుతున్నాం. తాలిబన్లు దేశ ప్రజల హక్కులకు ఎలాంటి హానీ తలపెట్టమని భరోసా ఇవ్వాలి’ అని ఫహీమ్‌ తెలిపారు.

ఇదిలా ఉండగా తాలిబన్లతో యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నామని.. దానికి తగిన సదుపాయాలు సమకూర్చుకున్నామని పంజ్‌షిర్‌ వ్యాలీ ప్రముఖ కామెండర్‌ అమీర్‌ అక్మల్‌ స్పష్టం చేశారు.  పంజ్‌షిర్‌ ప్రాంతంలో తజిక్‌ జాతికి చెందిన ప్రజలే అత్యధికంగా ఉంటారు. వీరు అహ్మద్‌ షా మసూద్‌ అధిపత్యంలో గెరిల్లా యుద్ధంలో ఆరి తేరారు. 1980లో సోవియట్‌ రష్యా దండయాత్రను తిప్పికొట్టడంతో పాటు 1996-2001లో తాలిబన్ల రాక్షస పాలనపై వీరు అవిశ్రాంత పోరాటం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని