Odisha Train Accident: ‘దుర్వాసన వస్తోంది.. కొన్ని మృతదేహాలు ఇంకా రైల్లోనే..?’

ఇటీవల ఒడిశాలో ప్రమాదానికి గురైన యశ్వంత్‌పుర్‌- హావ్‌డా రైల్లో కొన్ని మృతదేహాలు మిగిలిపోయాయని, వాటి నుంచి దుర్వాసన వస్తోందంటూ బహానగా గ్రామస్థులు రైల్వేకు ఫిర్యాదు చేశారు. అయితే, అది మృతదేహాలకు సంబంధించింది కాదని.. కుళ్లిపోతున్న కోడిగుడ్ల నుంచి వస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Updated : 09 Jun 2023 22:50 IST

అధికారులు ఏమన్నారంటే..

భువనేశ్వర్: ఒడిశా రైలు ప్రమాదం (Odisha Train Tragedy) తీవ్ర విషాదాన్ని నింపింది. మూడు రైళ్లు ఢీకొన్న ఈ ఘటనలో 288 మంది దుర్మరణం పాలయ్యారు. సహాయక చర్యల అనంతరం ట్రాక్‌ పునరుద్ధరణ క్రమంలో.. ధ్వంసమైన రైళ్లను అధికారులు ఘటనాస్థలంలోనే పక్కకు చేర్చారు. అయితే, యశ్వంత్‌పుర్‌- హావ్‌డా రైల్లో కొన్ని మృతదేహాలు మిగిలిపోయాయని, వాటి నుంచి దుర్వాసన వస్తోందంటూ బహనగా (Bahanaga) గ్రామస్థులు రైల్వే అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో రైల్వేశాఖ తనిఖీలు నిర్వహించింది. ఆ దుర్వాసన మృతదేహాలకు సంబంధించింది కాదని.. కుళ్లిపోతున్న కోడిగుడ్ల (Rotten eggs) నుంచి వస్తున్నట్లు తెలిపింది.

‘స్టేషన్‌ పరిసరాల్లో వస్తున్న దుర్వాసన.. కుళ్లిపోతున్న కోడిగుడ్ల నుంచి వస్తోంది. మృతదేహాలకు సంబంధించింది కాదు. సహాయక చర్యల ముగింపు సమయంలో ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందం క్షుణ్నంగా తనిఖీలు చేపట్టి, రెండుసార్లు క్లియరెన్స్‌ ఇచ్చింది’ అని ఆగ్నేయ రైల్వే జోన్‌ అధికారులు తెలిపారు. ‘ప్రమాద సమయంలో యశ్వంత్‌పుర్‌- హావ్‌డా ఎక్స్‌ప్రెస్‌ పార్సిల్‌ బోగీలో దాదాపు మూడు టన్నుల గుడ్లు ఉన్నాయి. అవన్నీ కుళ్లిపోతుండటంతో దుర్వాసన వస్తోంది. వాటిని మూడు ట్రాక్టర్లలో అక్కడి నుంచి తరలించాం’ అని వెల్లడించారు. మరోవైపు.. ఈ ప్రమాదానికి సంబంధించి ఇప్పటివరకు 661 బాధిత కుటుంబాలకు రూ.22.66 కోట్ల పరిహారాన్ని అందజేసినట్లు చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని