Goa: ఆస్తి వివాదం.. గోవాలో ఫ్రెంచ్‌ నటి నిర్బంధం..!

గోవాలో (Goa) నివాసం ఉంటున్న తనను కొందరు వ్యక్తులు నిర్బంధించినట్లు ఓ ఫ్రెంచ్‌ నటి (French Actor) ఆరోపించారు. ఆస్తి వివాదానికి సంబంధించిన వ్యవహారం కోర్టులో ఉండగానే.. తన ఇంటికి నీరు, కరెంటు తొలగించి వేధింపులకు గురిచేస్తున్నారని అన్నారు. 

Published : 28 Jan 2023 01:19 IST

పనాజీ: ఓ ఆస్తి వివాదానికి సంబంధించి గోవాలోని(Goa) ఇంట్లో తనను కొందరు వ్యక్తులు నిర్బంధించారని ఫ్రెంచ్‌ నటి (French Actor) ఆరోపించారు. ప్రస్తుతం తాను ప్రమాదకర స్థితిలో ఉన్నానన్నారు. ఉత్తర గోవాలో నివాసముంటున్న ఆమె.. ఇందుకు సంబంధించి ఓ వీడియో విడుదల చేశారు. అయితే, అది సివిల్‌ వివాదం కావడంతో ఈ వ్యవహారంలో జోక్యం చేసుకునేందుకు స్థానిక పోలీసులు నిరాకరించినట్లు సమాచారం.

పనాజీకి సమీపంలోని కలంగూట్‌ బీచ్‌ దగ్గర్లో ఉన్న ఇంట్లో మరియన్నే బార్గో (70) అనే ఫ్రెంచ్‌ నటి నివసిస్తున్నారు. ఆ ఇంటిని 2008లో ఓ న్యాయవాది నుంచి కొనుగోలు చేశారట. అయితే, ఆ ఆస్తి తమదేనంటూ కొందరు వ్యక్తులు ఇటీవల కోర్టులో దావా వేశారు. దీంతో తమవద్ద ఉన్న దస్త్రాలతో ట్రయల్‌ కోర్టులో ఫ్రెంచ్‌ నటి తరపు న్యాయవాది పిటిషన్‌ దాఖలు చేశారు. ఇలా ఈ వ్యవహారం న్యాయస్థానం పరిధిలో ఉండగానే దావా వేసిన వ్యక్తులు ఆ ఇంటికి కరెంటు, నీటి వసతిని తొలగించినట్లు ఆమె ఆరోపించారు. దీంతో గడిచిన మూడు రోజులుగా ఆమె చీకట్లోనే గడుపుతున్నానని వాపోయారు. అంతేకాకుండా ఇంటి గేటుకు తాళం వేయడంతోపాటు కేవలం పని మనిషిని మాత్రమే లోనికి అనుమతిస్తున్నారని ఆమె స్నేహితులు వెల్లడించారు.

ఫ్రెంచ్‌ నటి చేసిన ఆరోపణలపై స్పందించిన స్థానిక పోలీసులు.. ఆమె ఫిర్యాదు చేసినప్పుడల్లా ఆ ఇంటికి వెళ్లి పరిశీలిస్తున్నామని తెలిపారు. అయితే, ఈ కేసు న్యాయస్థానం పరిధిలో ఉన్నందున ఏమీ చేయలేకపోతున్నామని చెప్పారు. ఇదిలాఉంటే, పారిస్‌ కేంద్రంగా ఉండే నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ డ్రామాటిక్‌ ఆర్ట్స్‌లో శిక్షణ పొందిన ఆమె.. యూరప్‌తోపాటు భారతీయ చిత్రాల్లోనూ నటించారు. సినిమాల్లోనే కాకుండా టీవీ, కళారంగంలోనూ గుర్తింపు తెచ్చుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని