
Published : 06 Jan 2020 01:20 IST
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలపై భారత్ ఆందోళన
దిల్లీ: అమెరికా, ఇరాన్‌ల మధ్య పరిణామాలు ఎంతో ప్రమాదకర మలుపు తీసుకున్నాయని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పేర్కొన్నారు. ఈ మేరకు జైశంకర్ ట్విటర్ వేదికగా తెలియజేశారు. ‘ఇంతకు ముందే ఇరాన్ విదేశాంగ మంత్రి జరిఫ్‌తో చర్చించాను. అక్కడి పరిస్థితులు ఎంతో తీవ్రంగా ఉన్నాయి. ఈ ఉద్రిక్త పరిస్థితులపై భారత్ ఆందోళన వ్యక్తం చేస్తోంది.’ ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇరాన్ అగ్రశ్రేణి మేజర్ జనరల్ సులేమానీని శుక్రవారం యూఎస్ హత్య చేసిన విషయం తెలిసిందే. దీంతో ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ హెచ్చరించింది. ‘ఇరాన్, అమెరికా మధ్య పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళనను రేకెత్తిస్తున్నాయి. ఆ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం నెలకొనడం భారత్‌కు ఎంతో ముఖ్యమైన విషయం. ఈ పరిస్థితులు మరింత పెరగకుండా ఉండటం అవసరం’ అని భారత ప్రభుత్వం పేర్కొంది.
Tags :