‘పౌరచట్టం’పై సుప్రీంకు కేరళ ప్రభుత్వం

 దేశవ్యాప్తంగా ఆందోళనలకు కారణమైన పౌరసత్వ చట్టాన్ని సవాల్‌ చేస్తూ కేరళ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ చట్టాన్ని రాజ్యాంగ విరుద్ధమైనదిగా ప్రకటించాలని కోరుతూ పినరయి విజయన్‌ ప్రభుత్వం మంగళవారం పిటిషన్‌

Updated : 14 Jan 2020 16:22 IST

దిల్లీ: దేశవ్యాప్తంగా ఆందోళనలకు కారణమైన పౌరసత్వ చట్టాన్ని సవాల్‌ చేస్తూ కేరళ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ చట్టాన్ని రాజ్యాంగ విరుద్ధమైనదిగా ప్రకటించాలని కోరుతూ పినరయి విజయన్‌ ప్రభుత్వం మంగళవారం పిటిషన్‌ దాఖలు చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 14, 21, 25 నిబంధనలను ఈ చట్టం ఉల్లంఘిస్తోందని, అంతేగాక లౌకికవాదం ప్రాథమిక సిద్ధాంతాలకు విరుద్ధంగా ఉందని ఆరోపించింది. కాగా.. పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్‌ వేసిన తొలి రాష్ట్రం కేరళనే. దీంతో పాటు పాస్‌పోర్ట్‌ సవరణ నిబంధనలు 2015, విదేశీయుల చట్టం 2015 చెల్లుబాటును కూడా పినరయి ప్రభుత్వం సవాల్‌ చేసింది. 

కాగా.. సవరించిన పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా తీసుకొచ్చిన తీర్మానానికి కేరళ అసెంబ్లీ గత డిసెంబరులో ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. శాసనసభలో ఈ తీర్మానాన్ని సీఎం పినరయి విజయన్‌ ప్రవేశపెట్టగా.. ఒక్క భాజపా ఏకైక ఎమ్మెల్యే మినహా మిగతా శాసనసభ్యులందరూ ఆమోదముద్ర వేశారు. 

పొరుగుదేశాల్లో మతపీడనకు గురై భారత్‌లో ఆశ్రయించి కోరి వచ్చిన వారి శరణార్థులకు దేశ పౌరసత్వం కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ సవరణ బిల్లు తీసుకొచ్చింది. గతేడాది ఉభయ సభల్లో ఆమోదం పొందిన ఈ బిల్లు రాష్ట్రపతి సంతకంతో చట్టంగా మారింది. ఇటీవల పౌరసత్వ చట్టాన్ని అమల్లోకి తెస్తూ గెజిట్‌ నోటిఫికేషన్‌ కూడా జారీ అయ్యింది. అయితే ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున హింసాత్మక ఆందోళనలు చోటుచేసుకున్నాయి. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో కొనసాగుతున్నాయి కూడా. పౌరచట్టాన్ని రాష్ట్రాలు సైతం వ్యతిరేకిస్తున్నాయి. తమ రాష్ట్రాల్లో దీన్ని అమలు చేయబోమని స్పష్టం చేస్తున్నాయి. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని