‘కేవలం సీఎం కోసమే చదువుతున్నా’

కేరళ శాసనసభలో బుధవారం అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. పౌరసత్వ సవరణ చట్టాని(సీఏఏ)కి తొలి నుంచి ఆ రాష్ట్ర గవర్నర్‌ ఆరీఫ్‌ మహ్మద్‌ మద్దతు పలుకుతున్న........

Published : 30 Jan 2020 00:24 IST

కేరళ శాసనసభలో సీఏఏపై గవర్నర్‌ ఆరీఫ్‌ మహ్మద్‌

తిరువనంతపురం: కేరళ శాసనసభలో బుధవారం అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. పౌరసత్వ సవరణ చట్టాని(సీఏఏ)కి తొలి నుంచి ఆ రాష్ట్ర గవర్నర్‌ ఆరీఫ్‌ మహ్మద్‌ మద్దతు పలుకుతున్న విషయం తెలిసిందే. అయితే బుధవారం శాసనభ సమావేశాల ప్రారంభం సందర్భంగా తన ప్రభుత్వ విధానాలను వివరిస్తూ సీఏఏకి వ్యతిరేకంగా చేసిన తీర్మానాన్ని చదివి వినిపించారు. అయితే ఆ పాయింట్‌పై తనకు అభ్యంతరాలున్నప్పటికీ ముఖ్యమంత్రి అభీష్టం మేరకే చదువుతున్నానని చెబుతూ సభ్యులను ఆశ్చర్యానికి గురి చేశారు. ‘‘నేను ఈ పేరా(సీఏఏ అంశం)ని ముఖ్యమంత్రి చదవమన్నారు కావునే చదువుతున్నాను. ఇది ప్రభుత్వ విధానాల కిందకు రాదన్న అభిప్రాయాన్ని నేను ఇప్పటికే వ్యక్తం చేశాను’’ అని ఆరీఫ్‌ అన్నారు. సీఏఏని వ్యతిరేకించడం ప్రభుత్వ అభిప్రాయం మాత్రమే అని స్వయంగా సీఎం ప్రకటించారని ఇటీవల ఆరీఫ్‌  ఓ సందర్భంలో వ్యాఖ్యానించారు.

సీఏఏపై కేరళ ప్రభుత్వ విధానాన్ని గవర్నర్‌ ఆరీఫ్‌ మహ్మద్‌ చదువుతూ..‘‘మతం ఆధారంగా పౌరసత్వం కల్పించడం రాజ్యాంగ మౌలిక సూత్రాల్లో ఒకటైన లౌకికస్ఫూర్తికి విరుద్ధం. రాజ్యాంగ విరుద్ధంగా ఉందని భావించి సీఏఏకి వ్యతిరేకంగా నా ప్రభుత్వం తీర్మానం చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య బలమైన సంబంధాలు సమాఖ్య స్ఫూర్తికి మూలస్తంభం. ఈ నేపథ్యంలో ప్రభుత్వ అభ్యంతరాలు, ఆందోళనల్ని సైతం పరిగణనలోకి తీసుకొని కేంద్రం ఈ చట్టాన్ని రద్దు చేయాలని కోరుతున్నాం’’ అని అన్నారు. 

అనంతరం గవర్నర్‌ సభను వీడి వెళుతుండగా.. సీపీఎం నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్‌ కూటమి ఎమ్మెల్యేలు గవర్నర్‌ని అడ్డుకున్నారు. ఆయన కదలడానికి వీలు లేకుండా చుట్టూ చేరారు. దీంతో మార్షల్స్‌ రంగప్రవేశం చేసి గవర్నర్‌కి దారి కల్పించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని