ట్రంప్‌ ఆ 12 నిమిషాల ప్రయాణంలో..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తొలిసారి భారత్‌కు రానున్న నేపథ్యంలో ఏర్పాట్లు జోరుగా కొనసాగుతున్నాయి. పర్యటనలో భాగంగా ఆయన దిల్లీ, అహ్మదాబాద్‌తో పాటు ఆగ్రాలోని తాజ్‌మహల్‌ను....

Updated : 19 Feb 2020 15:31 IST

ఆగ్రా: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తొలిసారి భారత్‌కు రానున్న నేపథ్యంలో ఏర్పాట్లు జోరుగా కొనసాగుతున్నాయి. పర్యటనలో భాగంగా ఆయన దిల్లీ, అహ్మదాబాద్‌తో పాటు ఆగ్రాలోని తాజ్‌మహల్‌ను కూడా సందర్శించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం భారీ ఏర్పాట్లకు శ్రీకారం చుట్టింది. తాజ్‌ వరకు సాగే దాదాపు 12 నిమిషాల ప్రయాణంలో భారత సంస్కృతి ట్రంప్‌ కళ్లకు కట్టేట్లు చూపేందుకు యత్నిస్తున్నారు. అందులో భాగంగా రోడ్డుకిరువైపులా ఉండే గోడలపై భారత సంస్కృతీ సాంప్రదాయాలకు అద్దం పట్టే పెయింటింగ్స్ వేయిస్తున్నారు. అలాగే ప్రధాన కూడళ్ల వద్ద సాంస్కృతిక నృత్యాలు నిర్వహించనున్నారు. అందుకోసం దాదాపు 3000 మంది సంప్రదాయ నృత్యకారులను సమాయత్తం చేస్తున్నట్లు సమాచారం. ప్రముఖుల విగ్రహాలను కూడా సర్వాంగసుందరంగా తీర్చిదిద్దుతున్నారు. తాజ్‌ వద్ద నిర్వహించే ‘మొహబ్బత్‌-ది తాజ్‌’ అనే సాంస్కృతిక ప్రదర్శనను కూడా ట్రంప్ వీక్షించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

ఇప్పటికే వేలాది మంది కార్మికులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. రోడ్లు, డివైడర్లు, గోడలను శుభ్రం చేసే పనిలో పడ్డారు. స్థానికంగా లభిస్తున్న ప్రముఖ చిత్రాకారులనంతా ప్రభుత్వం రంగంలోకి దింపింది. వీరంతా భారత్‌-అమెరికా బంధానికి అద్దం పట్టే చిత్రాల్ని గోడలపై చిత్రిస్తున్నారు. మోదీ, ట్రంప్ మైత్రిని హైలైట్‌ చేస్తూ వారివురు కలిసున్న చిత్రాలను గోడలపై గీస్తున్నారు.

ఎన్‌ఎస్‌జీ, ఏటీఎస్‌ కమాండోలు...

భద్రతా ఏర్పాట్లను కూడా యోగి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఎన్‌ఎస్‌జీ, ఏటీఎస్‌ కమాండోలు సహా దాదాపు 6000 మంది భద్రతా బలగాల్ని రంగంలోకి దింపింది. ఇప్పటికే వీరంతా ఆయా ప్రాంతాల్లో క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. జనవరిలో అమెరికాకు చెందిన అడ్వాన్స్‌డ్‌ సెక్యూరిటీ 40 మంది సభ్యుల బృందం తాజ్‌ ప్రాంతాన్ని సందర్శించింది. భద్రతా పరమైన ఏర్పాట్లను పరిశీలించింది. ఆ తర్వాతే ట్రంప్‌ తాజ్‌ సందర్శన ఖాయమైంది. సోమవారం కూడా స్థానిక పోలీసులతో కలిసి అమెరికాకు చెందిన మరో బృందం భద్రతాపరమైన ఏర్పాట్లను తనిఖీ చేసింది. గతంలో ఒబామా చివరి నిమిషంలో తన తాజ్‌ సందర్శనను రద్దు చేసుకున్న విషయం తెలిసిందే.

యమునా నదికి నీటి విడుదల...

ట్రంప్‌ పర్యటన నేపథ్యంలో యూపీ ప్రభుత్వం యమునా నదికి 500 క్యూసెక్కుల నీటిని వదిలింది. బులంద్‌శహర్‌లోని గంగానహర్‌ కెనాల్‌ నుంచి నీటిని విడుదల చేసింది. తద్వారా మురుగు వాసన, చెత్త చెదారం తొలగిపోతుందని భావిస్తున్నారు. దీంతో ఆగ్రా ప్రాంతంలో యమునా నది కాలుష్యం తగ్గుతుందని అధికారులు తెలిపారు.

ఇవీ చదవండి..

ఎగిరే శ్వేతసౌధం.. ట్రంప్‌ విమానం

భారత్‌పై అలక వీడని ట్రంప్‌..?

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని