గడువు ముగియకుండానే డెత్‌ వారెంట్లా?

ఉరిశిక్ష పడ్డ దోషులు సుప్రీంకోర్టులో అప్పీల్‌ చేసుకోడానికి ఉన్న గడువు ముగియక ముందే ట్రయల్‌ కోర్టులు డెత్‌ వారెంట్‌లు జారీ చేయడాన్ని సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించింది.

Updated : 20 Feb 2020 17:03 IST

కింది కోర్టులను ప్రశ్నించిన సర్వోన్నత న్యాయస్థానం

దిల్లీ: ఉరిశిక్ష పడ్డ దోషులు సుప్రీంకోర్టులో అప్పీల్‌ చేసుకోడానికి ఉన్న గడువు ముగియక ముందే ట్రయల్‌ కోర్టులు డెత్‌ వారెంట్‌లు జారీ చేయడాన్ని సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. హత్యాచార కేసులో మరణశిక్ష పడ్డ ఓ దోషి వేసిన పిటిషన్‌ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. 

రెండేళ్ల క్రితం సూరత్‌లో జరిగిన మూడేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య ఘటనలో దోషి అనిల్‌ సురేంద్ర యాదవ్‌కు ఇటీవల మరణశిక్ష పడింది. దీంతో అతడిని ఫిబ్రవరి 29న ఉరితీయాలంటూ గుజరాత్‌ సెషన్స్‌ కోర్టు డెత్‌ వారెంట్‌ జారీ చేసింది. అయితే ఈ డెత్‌ వారెంట్‌పై దోషి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. సుప్రీంకోర్టులో అప్పీలు చేసుకోడానికి ఉన్న గడువు తీరకముందే తనపై డెత్‌ వారెంట్‌ జారీ చేశారని దోషి తన పిటిషన్‌లో పేర్కొన్నాడు. ఈ పిటిషన్‌ను విచారించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం ట్రయల్‌ కోర్టు తీర్పును ప్రశ్నించింది. 

ఈ సందర్భంగా మరణశిక్షపై దోషులు సుప్రీంకోర్టులో అప్పీల్‌ చేసుకోడానికి ఉన్న 60 రోజుల గడువు ముగియక ముందే కింది కోర్టులు డెత్‌ వారెంట్లు జారీ చేయరాదని 2015లో సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును ధర్మాసనం గుర్తుచేసింది. సుప్రీం తీర్పు చెప్పినప్పటికీ కింది కోర్టులు అలా ఎలా డెత్‌ వారెంట్లు ఇస్తాయని ప్రశ్నించింది. దీనిపై ఎవరో ఒకరు సమాధానం చెప్పాలని ఆదేశించింది. న్యాయవ్యవస్థ ఇలా పనిచేయడాన్ని తాము ఎప్పటికీ అంగీకరించబోమని స్పష్టం చేసింది. 

కింది కోర్టులు అలా డెత్‌ వారెంట్లు జారీ చేయడానికి కారణాలేంటో తెలుసుకోవాలని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతాను ధర్మాసనం ఆదేశించింది. ఈ సందర్భంగా దోషి అనిల్‌ సురేంద్ర యాదవ్‌పై గుజరాత్‌ సెషన్స్‌ కోర్టు ఇచ్చిన డెత్‌ వారెంట్లపై సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది.  

 

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని