వేడుకుంటున్నా..NRC, NPR వద్దు: కేజ్రీవాల్‌

జాతీయ జనాభా పట్టిక (ఎన్‌పీఆర్‌), జాతీయ పౌర పట్టిక (ఎన్‌ఆర్‌సీ)కి వ్యతిరేకంగా దిల్లీ అసెంబ్లీ తీర్మానం చేసింది. ఎన్‌పీఆర్‌, ఎన్‌ఆర్‌సీపై చర్చించేందుకు ఒక రోజు ప్రత్యేక సమావేశమైన దిల్లీ అసెంబ్లీ ఈ మేరకు తీర్మానానికి.........

Published : 13 Mar 2020 20:08 IST

ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌కు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం

దిల్లీ: జాతీయ జనాభా పట్టిక (ఎన్‌పీఆర్‌), జాతీయ పౌర పట్టిక (ఎన్‌ఆర్‌సీ)కి వ్యతిరేకంగా దిల్లీ అసెంబ్లీ తీర్మానం చేసింది. ఎన్‌పీఆర్‌, ఎన్‌ఆర్‌సీపై చర్చించేందుకు ఒక రోజు ప్రత్యేక సమావేశమైన దిల్లీ అసెంబ్లీ ఈ మేరకు తీర్మానానికి ఆమోదం తెలిపింది. పర్యావరణ మంత్రి గోపాల్‌రాయ్‌ దీన్ని ప్రవేశపెట్టగా సభ ఆమోదం తెలిపింది. చేతులెత్తి వేడుకుంటున్నా వీటిని వెనక్కి తీసుకోవాలని ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ ఈ సందర్భంగా కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.

‘‘నేను, నా భార్య, మా కేబినెట్‌లో ఎవరికీ పౌరసత్వాన్ని నిరూపించుకునేందుకు జనన ధ్రువీకరణ పత్రాలు లేవు. మమ్మల్ని నిర్బంధ కేంద్రాలకు తరలిస్తారా?’’ అని తీర్మానంపై చర్చ సందర్భంగా కేంద్రాన్ని కేజ్రీవాల్‌ ప్రశ్నించారు. ‘మీ బర్త్‌ సర్టిఫికెట్లు చూపించాలి’’ అంటూ కేంద్రమంత్రులకు సవాల్‌ విసిరారు. అంతకుముందు జనన ధ్రువీకరణ పత్రాలు ఉన్నవారు చేతులు పైకి ఎత్తాలని ఎమ్మెల్యేలకు సూచించారు. దీంతో 70 మంది ఉన్న సభలో కేవలం 9 మంది మాత్రమే చేతులు పైకి ఎత్తారు. దీంతో బర్త్‌ సర్టిఫికెట్లు లేని 61 మందినీ నిర్బంధ కేంద్రాలకు తరలిస్తారా?అని కేజ్రీవాల్‌ కేంద్రాన్ని నిలదీశారు.

అంతకుముందు తీర్మానంపై చర్చ సందర్భంగా పలువురు ఆప్‌ ఎమ్మెల్యేలు మాట్లాడారు. ఎన్‌ఆర్‌సీకి ఎన్‌పీఆర్‌ అనేది బ్యాక్‌ డోర్‌ అని, దేశంలో ఎక్కడా ఎన్‌పీఆర్‌ చేపట్టకూడదని డిమాండ్‌ చేశారు. ఒకవేళ ఎన్‌పీఆర్‌ చేపట్టాలనుకుంటే 2010 విధానాన్నే అనుసరించాలన్నారు. ఇప్పటికే కేరళ సహా పలు రాష్ట్రాలు ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌ను వ్యతిరేకిస్తూ తీర్మానాలు చేసిన సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని