10కి చేరిన కరోనా మృతులు!

దేశంలో అత్యంత వేగంగా విస్తరిస్తోన్న కరోనా వైరస్‌ మృతుల సంఖ్య తాజాగా పదికి చేరింది. ముంబయిలో కరోనా నిర్ధారణ ఐన 65ఏళ్ల వ్యక్తి ఈ రోజు మృతిచెందినట్లు వైద్యులు ప్రకటించారు. దీంతో మహారాష్ట్రలో మృతుల సంఖ్య మూడుకు చేరింది.

Published : 25 Mar 2020 01:35 IST

ముంబయి: దేశంలో అత్యంత వేగంగా విస్తరిస్తోన్న కరోనా వైరస్‌ మృతుల సంఖ్య తాజాగా పదికి చేరింది. ముంబయిలో కరోనా సోకిన 65ఏళ్ల వ్యక్తి ఈ రోజు మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. దీంతో మహారాష్ట్రలో మృతుల సంఖ్య మూడుకు చేరింది. కొవిడ్‌-19 తీవ్రత అధికంగా ఉన్న మహారాష్ట్రలో ఈ కేసుల సంఖ్య 106కు చేరిందని ఆ రాష్ట్ర వైద్యశాఖ ప్రకటించింది. మృతి చెందిన వ్యక్తి కొన్ని రోజుల క్రితం యూఏఈ నుంచి అహ్మదాబాద్‌ చేరుకున్నాడు. అనంతరం అతనికి జ్వరం, దగ్గు రావడంతో ముంబయిలోని ఆసుపత్రిలో చేర్పించారు. వైద్య పరీక్షల అనంతరం అతనికి కరోనా నిర్ధారణ అయినట్లు వైద్యులు వెల్లడించారు. గత నాలుగు రోజులుగా చికిత్స పొందుతూ ఈ రోజు మరణించాడని వైద్యులు తెలిపారు. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మహారాష్ట్రలో పూర్తి లాక్‌డౌన్‌ ప్రకటించింది.

ఇదిలాఉంటే, దేశవ్యాప్తంగా ఇప్పటికే 492 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. తెలంగాణలో తాజాగా మూడు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుకాగా మొత్తం సంఖ్య 36కు చేరింది. తమిళనాడులో కూడా ఈ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా అమెరికా, స్విట్జర్లాండ్‌ నుంచి వచ్చిన ఇద్దరికి కొవిడ్‌-19 నిర్ధారణ కావడంతో ఈ కేసుల సంఖ్య 12కు చేరినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా కేసుల తీవ్రత దృష్ట్యా చెన్నైలో ప్రత్యేకంగా 350పడకల ఆసుపత్రులను సిద్ధం చేస్తున్నామని తెలిపింది.

వైద్య సదుపాయాలు మెరుగుపరచండి: ఈ సంక్షోభ సమయంలో మరిన్ని చర్యలు తీసుకోవాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది. దీనిలో భాగంగా ఆసుపత్రుల్లో ఐసోలేషన్‌ వార్డులు, క్లినికల్‌ ల్యాబ్‌లుతో పాటు మరిన్ని వైద్య సదుపాయాలను ఏర్పాటు చేసుకునేందుకు ప్రత్యేక నిధులను కేటాయించాలని పేర్కొంది. ముఖ్యంగా చికిత్సకోసం కావాల్సిన వెంటిలేటర్లు, వ్యక్తిగత రక్షణ పరికరాలు, మాస్కులు, మందులను సిద్ధంచేసుకోవాలని సూచించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని