ఆ ప్రాంతాల్లో దుకాణాలు తెరిచేందుకు అనుమతి

స్థానిక దుకాణాలను కూడా తెరిచేందుకు నిన్న అర్ధరాత్రి విడుదల చేసిన ఓ ప్రకటనలో కేంద్రం అనుమతించింది. 

Updated : 25 Apr 2020 12:34 IST

దిల్లీ: కరోనా వైరస్‌ కట్టడి కోసం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అత్యవసర సర్వీసులు మినహా అన్ని సేవలు మూతపడ్డాయి. కాగా, కొన్ని షరతులపై స్థానిక దుకాణాలను తెరిచేందుకు అనుమతిస్తూ నిన్న అర్ధరాత్రి  కేంద్ర ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది.

హోం శాఖ ఆదేశాల ప్రకారం... ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ‘షాప్స్‌ అండ్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ యాక్ట్ల్‌’ పరిధిలోకి వచ్చే రిజిస్ట్రేషన్‌ కలిగిన అన్ని దుకాణాలను ఇకపై తెరవవచ్చు. మున్సిపల్‌ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలోకి వచ్చే నివాస సముదాయాలు, ప్రాంతాల్లోని అన్ని దుకాణాలకు లాక్‌డౌన్‌ నుంచి మినహాయింపు ఇస్తున్నట్టు హోంశాఖ ఆదేశాలు జారీచేసింది. అయితే సింగిల్ బ్రాండ్‌ లేదా వివిధ బ్రాండ్‌ల వస్తువులను విక్రయించే మాల్స్‌, కమర్షియల్‌ కాంప్లెక్స్‌లలో ఉండే దుకాణాలు తెరిచేందుకు మాత్రం అనుమతి లేదని ఆ శాఖ స్పష్టం చేసింది. అయితే ఈ సడలింపులు హాట్‌ స్పాట్లు, రెడ్ జోన్లు, కంటైన్‌మెంట్‌ ప్రాంతాలకు వర్తించవు. ఇక్కడ గతంలో విధించిన నిషేధాజ్ఞలు యథాతథంగా కొనసాగుతాయి. 

ఇక దుకాణదారులు 50 శాతం సిబ్బందిని మాత్రమే వినియోగించాలని, పనిసమయంలో మాస్కులు ధరించటం, సామాజిక దూరం పాటించటం తదితర జాగ్రత్తలు తప్పనిసరి అని కేంద్ర హోంశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే దిల్లీలో ఎలాంటి సడలింపులు ఇవ్వబోమని ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ ప్రకటించారు.

 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని